మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరువులకు కొత్త కళ!...జగిత్యాల జిల్లాలో ఆరు చెరువుల అభివృద్ధికి రూ.18.84 కోట్లు

మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చెరువులకు కొత్త కళ!...జగిత్యాల జిల్లాలో ఆరు చెరువుల అభివృద్ధికి రూ.18.84 కోట్లు
  •     రెండేళ్లలో పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు లక్ష్యం
  •     టెండర్లు పూర్తి... పనులు షురూ 

జగిత్యాల, వెలుగు:  కొన్నేండ్లుగా మున్సిపాలిటీల్లోంచి వచ్చే మురుగునీరు, పిచ్చిమొక్కలతో కాలుష్య కాసారాలుగా మారిన చెరువులకు కొత్త కళ రానుంది. జగిత్యాల జిల్లాలో వివిధ మున్సిపాలిటీల పరిధిలోని ఆరు చెరువులను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తికాగా పనులు ప్రారంభమయ్యాయి. పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా జిల్లాలోని చాలా మున్సిపాలిటీల్లో సివరేజ్ ట్రీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ ప్లాంట్లు లేకపోవడంతో మురుగు నీరు నేరుగా చెరువుల్లోకి చేరుతోంది. దీంతో నీరు కలుషితమవడంతో పాటు పిచ్చిమొక్కలు పెరిగాయి. కొన్ని ప్రాంతాల్లో చెత్తాచెదారం, చికెన్ వ్యర్థాలు వేయడంతో పరిస్థితి అధ్వానంగా మారింది. ఫలితంగా భూగర్భ జలాల పెంపు, తాగునీటి అవసరాల కోసం ఉపయోగపడాల్సిన చెరువులు కాలుష్యంలో చిక్కుకుంటున్నాయి. 

రూ.18.84 కోట్లతో అభివృద్ధి పనులు

అమృత్-2.0 పథకం కింద జిల్లాలోని ఆరు చెరువుల అభివృద్ధికి రూ.18.84 కోట్ల నిధులు మంజూరయ్యాయి. జిల్లా కేంద్రంలోని మోతె, చింతకుంట చెరువులతోపాటు రాయికల్, కోరుట్ల, మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పల్లి, ధర్మపురి మున్సిపాలిటీల్లో ఒక్కో చెరువును అభివృద్ధి చేయనున్నారు. ఒక్కో చెరువు అభివృద్ధికి సుమారు రూ.3.14 కోట్లు ఖర్చు చేయనున్నారు. కాగా ఈ పథకం కింద నాలుగు నెలల క్రితమే నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. జిల్లాలోని 45 చెరువులకు ఒకేసారి టెండర్లు నిర్వహించాల్సి రావడం, మొదట్లో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో ప్రక్రియ జాప్యమైంది. ఇటీవల ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడంతో టెండర్ ప్రక్రియ పూర్తయింది. దీంతో పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు వేగవంతం చేశారు. ఇప్పటికే మోతె చెరువులో పనులు మొదలయ్యాయి. చింతకుంట చెరువు అభివృద్ధి పనులు కూడా ప్రారంభం కానున్నాయి. 

మురుగు చేరకుండా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ

అమృత్ 2.0 కింద అభివృద్ధి పనులు చేపట్టనున్న చెరువుల్లోకి మురుగు నీరు చేరకుండా ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నారు. చెరువుల చుట్టూ రక్షణ గోడలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేయనున్నారు. వాకింగ్ ట్రాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, పచ్చదనం, ఇతర మౌలిక వసతులు కల్పించనున్నారు. చెరువుల పరిధిలో కబ్జాలు పెరుగుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చెరువు సరిహద్దులను గుర్తించి రక్షణ చర్యలు చేపట్టడం ద్వారా ఆక్రమణలను అడ్డుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతో చెరువుల విస్తీర్ణంతో పాటు నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరగనుంది. పనులు పూర్తయితే ప్రస్తుతం కళ తప్పిన చెరువులు పర్యాటక ఆకర్షణలుగా మారనున్నాయి.