- ఏడాదికి ఐదుసార్లు తీసుకోవచ్చు
- మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
ఎల్బీనగర్, వెలుగు: రోడ్డు ప్రమాద బాధితులను ‘గోల్డెన్ అవర్’లో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి రూ.25 వేల నగదుతో పాటు ‘రహ్వీర్’ అవార్డును అందజేస్తామని, ఇలా ఏడాదికి ఐదుసార్లు ఈ పురస్కారాన్ని అందుకునే అవకాశం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గతంలో సాక్ష్యాల పేరుతో పోలీసులు, కోర్టులు ఇబ్బంది పెడతారనే అపోహ ఉండేదని, కానీ ఇప్పుడు ప్రాణాలు కాపాడే వారికి పూర్తి ప్రోత్సాహం ఉంటుందన్నారు. శుక్రవారం నాగోల్లోని బాబు జగ్జీవన్ రామ్ డ్రైవింగ్ సెంటర్లో జరిగిన ‘అరైవ్-అలైవ్’ రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు.
రోడ్డు భద్రత కోసం 4ఈల ( ఇంజినీరింగ్, ఎన్ఫోర్స్మెంట్, ఎడ్యుకేషన్, ఎమర్జెన్సీ కేర్) సూత్రం అవసరమని, ఇందులో భాగంగానే ఇంజనీరింగ్ విభాగంతో కలిసి ప్రమాదకరమైన ‘బ్లాక్ స్పాట్స్’ను గుర్తించి తొలగిస్తున్నామని చెప్పారు.
చిన్న చిన్న పొరపాట్ల వల్ల కుటుంబాలు రోడ్డున పడకుండా ఉండాలంటే తప్పనిసరిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని సూచించారు. అనంతరం వాహనదారులతో మంత్రి ప్రతిజ్ఞ చేయించి, కంటి పరీక్షలు, సీపీఆర్ అవగాహన కార్యక్రమాలను ప్రారంభించారు. మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి పాల్గొన్నారు.

