నేషనల్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లకు కేరాఫ్ హైదరాబాద్  

నేషనల్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లకు కేరాఫ్ హైదరాబాద్  
  • జనవరి నుంచి డిసెంబర్ దాకా ప్రపంచ ఈవెంట్లతో బిజీబిజీ
  • కంఫర్టబుల్ సిటీ ఆఫ్ ఇండియాలో హైదరాబాద్ టాప్ 
  • ఇటీవల భారత్ సమిట్.. త్వరలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సదస్సు 
  • 60కి పైగా అంతర్జాతీయ నగరాలకు డైరెక్ట్ విమానాలు 
  • ఓఆర్ఆర్, మెట్రో, లగ్జరీ హోటళ్ల దన్ను

హైదరాబాద్, వెలుగు: జాతీయ, అంతర్జాతీయ స్థాయి సదస్సులకు కేరాఫ్ అడ్రస్‌గా హైదరాబాద్ నిలుస్తోంది. ఏడాది పొడవునా ప్రపంచ ఈవెంట్లతో భాగ్యనగరం సందడిగా మారింది. దేశంలోనే అత్యంత సౌకర్యవంతమైన నగరంగా హైదరాబాద్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రపంచ స్థాయి మౌలిక వసతులు, ప్రశాంతమైన వాతావరణం, పటిష్టమైన శాంతిభద్రతలు ఉండటంతో దేశవిదేశాల ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు నగరానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్​లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా నవంబర్ 15 నుంచి 17 వరకు ‘ఎన్​డీఈ 2026,​ ఏరోఎన్​డీటీ 2026’ (36వ వార్షిక నాన్-డిస్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ కాన్ఫరెన్స్, 15వ అంతర్జాతీయ ఏరోస్పేస్ సింపోజియం) సదస్సు జరుగుతోంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు నగరంలో భారత్ సమిట్, బయో ఆసియా 2026, వింగ్స్ ఇండియా ఏవియేషన్ ఫోరం, గ్లోబల్ ఏఐ కాంక్లేవ్ వంటి అనేక పెద్ద సదస్సులు విజయవంతంగా జరిగాయి.

రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా రోడ్డు ఇంజినీరింగ్ నిపుణులతో జరిగే ‘ఇండియన్ రోడ్ కాంగ్రెస్’ (ఐఆర్​సీ) వార్షిక సదస్సు ఇక్కడే జరగనుంది. అలాగే డిసెంబర్ 7 నుంచి 9 వరకు భారత్​ఫ్యూచర్ సిటీలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సదస్సు –2026’ను నిర్వహించబోతోంది. ఏరోస్పేస్, రక్షణ, ఫార్మా, గ్రీన్ ఎనర్జీ వంటి 14 ప్రధాన రంగాల్లో  పెద్ద కంపెనీలు ఉండటం కూడా కలిసివచ్చింది.

హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ), హైటెక్స్ వంటి ప్రపంచ స్థాయి వేదికలు అందుబాటులో ఉన్నాయి. వేలాది మంది ప్రతినిధులు ఒకేసారి కూర్చునేలా పిల్లర్లు లేని విశాలమైన హాల్స్, ఆధునిక ఆడియో-విజువల్ సాంకేతికత వీటి సొంతం. అంతేకాకుండా సదస్సుల ప్రాంగణాలకు నడిచివెళ్లే దూరంలో లేదా 5 నుంచి 15 నిమిషాల ప్రయాణంలోనే నోవొటెల్, ఐటీసీ కోహినూర్, పార్క్ హయాత్, వెస్టిన్ వంటి అంతర్జాతీయ స్థాయి ఫైవ్- స్టార్ హోటళ్లు ఉండటం విదేశీ అతిథుల బసకు అనుకూలంగా మారింది.

అన్ని సదస్సులు సక్సెస్..

ఈ ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు బేగంపేట విమానాశ్రయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రాష్ట్ర ప్రభుత్వం, ఫిక్కీ భాగస్వామ్యంతో ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన ‘వింగ్స్ ఇండియా  ’ విజయవంతంగా జరిగింది. అనంతరం ఫిబ్రవరి 17, 18 తేదీల్లో హెచ్ఐసీసీ వేదికగా లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ప్రతిష్టాత్మక 23వ బయో ఆసియా అంతర్జాతీయ సదస్సు’ గ్లోబల్ దృష్టిని ఆకర్షించింది.

ఇటీవల నవంబర్ 13, 14 తేదీల్లో హెచ్ఐసీసీలోనే 70 దేశాల నుంచి 1,000 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు, మేధావుల భాగస్వామ్యంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ ఎకానమీ, వాతావరణ మార్పులపై భారత్ సమిట్ దిగ్విజయంగా సాగింది. ప్రస్తుతం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ హాల్ నంబర్ 4లో నవంబర్ 15 నుంచి 17 వరకు కేంద్ర రక్షణ శాఖ (డీఆర్డీవో), ఇండియన్ సొసైటీ ఫర్ నాన్-డిస్ట్రక్టివ్ టెస్టింగ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఎన్​డీఈ 2026 అండ్​ ఏరోఎన్​డీటీ 2026’ (36వ వార్షిక నాన్-డిస్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ కాన్ఫరెన్స్, 15వ అంతర్జాతీయ ఏరోస్పేస్ సింపోజియం) సదస్సును కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రారంభించి నయా టెక్నాలజీ ప్రాధాన్యతను వివరించారు.

వీటితో పాటు అక్టోబర్ 1న నోవొటెల్ వేదికగా ఐసీఏఐ గ్లోబల్ లీడర్స్ బిజినెస్ మీట్, సెప్టెంబర్ 10, 11 తేదీలలో ఐఐఎంసీ జాతీయ సదస్సు, నవంబర్ 14, 15 తేదీల్లో అసోసియేషన్ ఆఫ్ డెంటల్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో  సదస్సులు ఘనంగా ముగిశాయి. 

విదేశీయులను ఆకట్టుకుంటున్న హైదరాబాద్..

ప్రపంచ ప్రఖ్యాత మెర్సర్ సంస్థ విడుదల చేసిన తాజా క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ప్రకారం.. దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అత్యుత్తమ జీవన ప్రమాణాలున్న నగరంగా హైదరాబాద్ వరుసగా ఏడో ఏడాది కూడా దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. ముంబై, బెంగళూరు, చెన్నై నగరాలతో పోలిస్తే ఇక్కడ నివాస ఖర్చులు తక్కువగా ఉండటం, అన్ని అంతర్జాతీయ సదుపాయాలు అందుబాటులో ఉండటం విదేశీయులను ఆకట్టుకుంటోంది.

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోని 60కి పైగా ప్రధాన నగరాలకు నేరుగా విమాన సర్వీసులను కలిగి ఉండగా, ఎయిర్‌పోర్టు నుంచి 158 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) ద్వారా కేవలం 30 నుంచి 40 నిమిషాల్లోనే హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వేదికలకు చేరుకోవచ్చు. దీనికి తోడు మెట్రో రైలు నెట్‌వర్క్ ప్రయాణాన్ని మరింత సులభతరం చేస్తోంది.

హైదరాబాద్ ఇప్పటికే ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలకు కీలక కేంద్రంగా ఉంటూ 300కి పైగా పరిశోధన సంస్థలను కలిగి ఉండటంతో అంతర్జాతీయ సదస్సుల నిర్వహణకు సహజంగానే తొలి ప్రాధాన్యత లభిస్తోంది. ఆధునిక కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పటిష్ట శాంతిభద్రతల పర్యవేక్షణ, మహిళా ఉద్యోగులు, విదేశీ ప్రతినిధులకు సురక్షిత వాతావరణం, ఏడాది పొడవునా అనుకూలమైన వాతావరణం ఉండటం నగరానికి కలిసివస్తోంది.