Hockey World Cup: హైదరాబాద్ మహా నగరం మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా వేడుకకు వేదిక కానుంది. ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి హాకీ (FIH) ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 టోర్నమెంట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దూరదృష్టితో క్రీడాశాఖ ఆధ్వర్యంలో ఈ టోర్నమెంట్‌ను అత్యున్నత ప్రమాణాలతో నిర్వహించేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందించబడింది. ఈ పోటీలు మార్చి 8వ తేదీ నుంచి 14 వరకు హైదరాబాద్‌లో నూతనంగా పునర్నిర్మించబడిన గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరుగనున్నాయి.
పోటీలో పాల్గొనే టీమ్స్:
ఈ క్వాలిఫయర్స్‌లో మొత్తం ఎనిమిది దేశాల జట్లు పాల్గొంటున్నాయి:
* భారత్
* ఆస్ట్రియా
* ఇంగ్లాండ్
* ఇటలీ
* కొరియా
* స్కాట్లాండ్
* ఉరుగ్వే
* వేల్స్
ఈ టోర్నమెంట్ 2026 మహిళల హాకీ వరల్డ్ కప్‌కు అర్హత సాధించేందుకు కీలక పాత్ర పోషించనుంది. అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలతో తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఎటువంటి లోపాలు లేకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. స్టేడియంలో: అంతర్జాతీయ ప్రమాణాల ఆస్ట్రో టర్ఫ్, ఆధునిక సదుపాయాలు, అత్యున్నత భద్రతా ఏర్పాట్లు, క్రీడాకారులతో పాటు అధికారుల కోసం ప్రీమియం వసతులను అందుబాటులో ఉంచబడ్డాయి. అలాగే హాకీ ఇండియా, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డి హాకీ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలోని పలు శాఖలతో సమన్వయం చేసుకుంటూ ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
జట్ల రాక:
భారత్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, ఉరుగ్వే జట్లు ఇప్పటికే హైదరాబాద్‌కు చేరుకున్నాయి. అన్ని టీమ్స్ కి అంతర్జాతీయ ప్రమాణాల వసతితో పాటు ప్రపంచ స్థాయి సదుపాయాలు కల్పించబడ్డాయి. ఈ టోర్నమెంట్ సందర్భంగా నగరానికి విచ్చేసే క్రీడాకారుల కోసం ప్రత్యేక వారసత్వ పర్యటనలు, వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ సంస్కృతి, వారసత్వాన్ని పరిచయం చేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాలు రూపొందించబడ్డాయి.
క్రీడాభివృద్ధికి కట్టుబడి:
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతతో హైదరాబాద్ లో అనేక జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. మహిళల హాకీ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ 2026 నిర్వహణతో హైదరాబాద్ మరోసారి ప్రపంచ క్రీడా పటంలో తన స్థానాన్ని మరింత బలపరుచుకోనుంది. ఈ సందర్భంగా అన్ని జట్లు, అధికారులు, అభిమానులను తెలంగాణ సర్కార్ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతుంది.
