- ఎల్‌నినో ముప్పుతో ప్రభుత్వం సన్నద్ధత
- 14 నెలల ఆహార భద్రతకు ప్రణాళిక
- ప్రతిపాదనలపై సమగ్ర రిపోర్టు
- కోరిన పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినో ప్రభావంతో ధరలు పెరిగితే పేద కుటుంబాలపై భారం పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలకు సిద్ధమవుతున్నది. రేషన్ ద్వారా గోధుమపిండితోపాటు కందిపప్పు, పామాయిల్, చక్కెర, చింతపండు, కారం పొడి వంటి నిత్యావసరాలను సబ్సిడీ ధరలకు పంపిణీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నది. ఈ ప్రతిపాదనలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.
సోమవారం సెక్రటేరియెట్‌లో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పలు అంశాలను చర్చించారు. సరుకుల సేకరణ, పంపిణీ వ్యయం, లబ్ధిదారులకు ఇవ్వాల్సిన పరిమాణాలపై సమగ్ర అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. పూర్తి వివరాలతో నివేదిక వచ్చాక పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
3.42 కోట్ల మంది ఆహార భద్రత..
ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తగ్గి పంటలు దెబ్బతిన్నా రేషన్ బియ్యం సరఫరాకు ఆటంకం కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రజాపంపిణీ వ్యవస్థపై ఆధారపడిన సుమారు 3.42 కోట్ల మంది ఆహార భద్రతకు భరోసా కల్పించడమే లక్ష్యమన్నారు. ఇందుకోసం 14 నెలల అవసరాలకు సరిపడా ఆహార ధాన్యాల నిల్వలను సమకూర్చుకోవడంపై దృష్టి సారించినట్లు చెప్పారు. రాబోయే వరి దిగుబడిపైనే ఆధారపడకుండా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.28.03 లక్షల టన్నుల బియ్యం లభ్యత
రేషన్, ఇతర సంక్షేమ పథకాలకు నెలకు దాదాపు 2.38 లక్షల టన్నుల బియ్యం అవసరమవుతున్నదని అధికారులు తెలిపారు. ఈ లెక్కన ఏడాదికి 28.56 లక్షల టన్నులు కావాలి. అక్టోబర్ 16 నాటికి రాష్ట్రంలోని బఫర్ గోదాముల్లో 9.64 లక్షల టన్నుల బియ్యం నిల్వలు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో కేంద్ర పూల్, ఇతర సంక్షేమ పథకాల కింద 3.50 లక్షల టన్నులు, రాష్ట్ర పూల్ కింద 6.14 లక్షల టన్నులు ఉన్నాయి.
పెండింగ్‌లో ఉన్న కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్), ఇతర గుర్తించిన సరఫరాల ద్వారా మరో 18.39 లక్షల టన్నుల బియ్యం రావాల్సి ఉందని తెలిపారు. ప్రస్తుత నిల్వలు, రావాల్సిన బియ్యం కలిపి మొత్తం 28.03 లక్షల టన్నులు అందుబాటులోకి వస్తాయని అంచనా వేశారు. ఈ పరిమాణం రేషన్, ఇతర సంక్షేమ పథకాల అవసరాలకు దాదాపు 11.7 నెలలపాటు సరిపోతుందని, 2027 సెప్టెంబర్
వరకు అవసరాలు తీరుతాయని వివరించారు.
సరఫరాలో అంతరాయం రాకుండా చర్యలు
మిల్లర్లు, ఇతర వనరుల నుంచి రావాల్సిన బియ్యాన్ని నిర్ణీత గడువులోగా ప్రభుత్వ గోదాములకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. వర్షాభావం, పంట నష్టాలు, ఆహార ధరల పెరుగుదల వంటి పరిస్థితులు ఎదురైనా పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేలా పనిచేయాలని సూచించారు. సమీక్షలో పౌరసరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
