కుతుబ్ షాహీ సమాధుల వద్ద నేచర్ మీట్స్ హెరిటేజ్ వాక్

కుతుబ్ షాహీ సమాధుల వద్ద నేచర్ మీట్స్ హెరిటేజ్ వాక్
  •     పక్షి జాతులు, వృక్షసంపదను పరిశీలించిన ఔత్సాహికులు

హైదరాబాద్, వెలుగు: ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం హైదరాబాద్ ఇబ్రహీంబాగ్‌‌‌‌లోని చారిత్రక కుతుబ్ షాహీ సమాధుల వద్ద 'నేచర్ మీట్స్ హెరిటేజ్' (ప్రకృతి–వారసత్వం సమ్మేళనం) పేరిట ప్రత్యేక వాక్ నిర్వహించారు. తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ), రాష్ట్ర పురావస్తు, వారసత్వ శాఖ, దక్కన్ హెరిటేజ్ అకాడమీ ట్రస్ట్, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ (ఏకేటీసీ) సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 50 మంది వారసత్వ ప్రేమికులు, ప్రకృతి ఔత్సాహికులు, పక్షి పరిశీలకులు పాల్గొన్నారు. కట్టడాల నిర్మాణ శైలి, వృక్షజాతులు, పర్యావరణ ప్రాధాన్యతపై నిపుణులు అవగాహన కల్పించారు.

వారసత్వ సంపదను కాపాడుకోవాలి..

పర్షియన్, దక్కనీ, భారతీయ నిర్మాణ శైలుల సమ్మేళనానికి కుతుబ్ షాహీ సమాధులు అద్భుత ప్రతీకగా నిలుస్తున్నాయని రాష్ట్ర వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు పేర్కొన్నారు. వారసత్వ సంపద అంటే కేవలం చారిత్రక కట్టడాలే కాదని, వాటి చుట్టూ ఉన్న ప్రకృతి, జీవవైవిధ్యం కూడా అంతర్భాగమేనని టూరిజం ఎండీ క్రాంతి వల్లూరు పేర్కొన్నారు. కాగా, ఈ నెల 29న పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మూడో నేచర్ వాక్‌‌‌‌ను నిర్వహించనున్నట్లు టీజీటీడీసీ ప్రకటించింది. ఆసక్తి గల వారు మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ల కోసం 80192 49292 నంబర్‌‌‌‌లో సంప్రదించాలని కోరింది.