- క్లెయిమ్‌లు, అభ్యంతరాలకు 9.07 లక్షల అప్లికేషన్లు
- ఇప్పటి వరకు 31.74 లక్షల నోటీసుల అందజేత.. 1.94 లక్షల విచారణ పూర్తి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద ఈ నెల 5, 6, 12, 13 తేదీల్లో రెండు విడతలుగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సుదర్శన్ రెడ్డి తెలిపారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరించే ప్రక్రియను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ క్యాంపెయిన్ చేపడుతున్నట్లు చెప్పారు. ఆగస్టు 17న విడుదల చేసిన ముసాయిదా జాబితాపై ఓటర్లు సెప్టెంబర్ 16 వరకు దరఖాస్తులు, అభ్యంతరాలు సమర్పించవచ్చని తెలిపారు.
వాటి పరిశీలన, పరిష్కార ప్రక్రియను అక్టోబర్ 15 నాటికి పూర్తి చేయాలని గడువు పెట్టినట్లు వెల్లడించారు. ఇప్పటివరకు 92,88,112 నోటీసులు అందగా.. 31,74,952 నోటీసులను సంబంధిత ఓటర్లకు అందజేశామని చెప్పారు. మిగతావి కూడా దశలవారీగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని 119 మంది ఈఆర్‌వోలు, 1,973 మంది ఏఈఆర్‌వోల పర్యవేక్షణలో గడువులోగా విచారణ పూర్తి చేస్తామని సీఈవో తెలిపారు.
కొత్త ఓటరు కోసం 3.94 లక్షల అప్లికేషన్లు
ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలైనప్పటి నుంచి మొత్తం 9,07,292 క్లెయిమ్‌లు, అభ్యంతరాలు అందాయి. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం-6 ద్వారా 3,94,517 దరఖాస్తులు వచ్చాయి. ఎన్‌ఆర్‌ఐ ఓటర్ల నమోదుకు ఫారం-6ఏ ద్వారా 6,346 అప్లికేషన్లు అందాయి. అనర్హులు, తప్పుడు పేర్ల తొలగింపుపై 48,752 అభ్యంతరాలు రాగా.. ఓటర్ల వివరాల సవరణ, చిరునామా మార్పులకు అత్యధికంగా 4,57,677 దరఖాస్తులు వచ్చాయి. ఏఈఆర్‌వోల స్థాయిలో ఇప్పటివరకు 1,94,737 దరఖాస్తులు, నోటీసులకు సంబంధించిన విచారణలు పూర్తయ్యాయి.
అక్కడికక్కడే ఫారాలు నింపేలా ఏర్పాట్లు..
ముసాయిదా జాబితాలతోపాటు వలస వెళ్లినవారు, మరణించినవారు, రెండు చోట్ల పేర్లు నమోదైన ఓటర్ల జాబితాలను ఈఆర్‌వో కార్యాలయాల్లో, సీఈవో వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి తమ పేర్లను సరిచూసుకోవడంతోపాటు అవసరమైన మార్పులు, చేర్పుల కోసం అక్కడికక్కడే ఫారం-6, 7, 8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈఆర్‌వో కార్యాలయాల్లోనూ దరఖాస్తులు యథావిధిగా స్వీకరిస్తామని సీఈవో తెలిపారు. అర్హులైన పౌరులు స్పెషల్ క్యాంపెయిన్‌ను వినియోగించుకోవాలని కోరారు.
