ఎంసెట్ పరీక్ష రాయనున్న 56 ఏళ్ల వ్యక్తి

ఎంసెట్ పరీక్ష రాయనున్న 56 ఏళ్ల వ్యక్తి

చదువుకు..వయస్సుకు సంబంధం లేదు. ఆసక్తి..పట్టుదల ఉంటే చాలు..ఏ వయసులో అయినా ..ఏ పరీక్ష అయినా రాయొచ్చు. తెలంగాణ ఎంసెట్ పరీక్షను 56 ఏళ్ల వ్యక్తి రాయబోవడమే ఇందుకు నిదర్శనం. ఈ ఏడాది తెలంగాణ స్టేట్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్  ప్రవేశ పరీక్షకు 56 ఏళ్ల అభ్యర్థి హాజరవనున్నాడు. 

రాష్ట్రంలో గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సులను అభ్యసించడానికి గరిష్ట వయో పరిమితి లేదు. ఈ నేపథ్యంలో 56 ఏళ్ల ఓ వ్యక్తి ఎంసెట్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. ఇతనితో పాటు..35 ఏళ్లు పైబడిన మరో ముగ్గురు అభ్యర్థులు కూడా పరీక్ష రాయబోతున్నారు. వీరంతా యువ అభ్యర్థులతో పోటీపడబోతున్నారు.  అయితే వీరి పేర్లను మాత్రం ఎంసెట్ నిర్వహణ అధికారులు వెల్లడించలేదు.  

మే 10 నుంచి మే 14 వరకు ఎంసెట్ పరీక్షలు జరుగుతాయి.  మే 10,11న అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ పరీక్షలు నిర్వహించనుండగా.... మే 12,13,14వ తేదీల్లో ఇంజినీరింగ్ స్ట్రీమ్ ఎగ్జామ్ జరుగుతుంది. రెండు విడతలుగా ఈ  పరీక్షలు జరుగుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు.. ఆ తర్వాత మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

ఈ ఏడాది రికార్డు స్థాయిలో మొత్తం 3,20,384 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇది 53,670 ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం దరఖాస్తుల్లో ఇంజనీరింగ్ పరీక్ష కోసం 2,05,031 మంది అగ్రి కల్చర్, మెడికల్ పరీక్షల కోసం 1,14,981 మంది అప్లై చేసుకున్నారు. 372 మంది అగ్రికల్చర్, మెడికల్ రెండూ దరఖాస్తు చేసుకున్నారు.  అగ్రికల్చర్, మెడికల్ ఎంట్రన్స్ కోసం 113, ఇంజినీరింగ్ కోసం 137 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో రాష్ట్రంలో 104 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఆంధ్రప్రదేశ్‌లో 33 కేంద్రాలు ఏర్పాటు చేశారు.  ఇప్పటికే హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. https://eamcet.tsche.ac.in/ వెబ్‌సైట్‌ద్వారా హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.