- రెండు మున్సిపల్ చైర్మన్ ఎన్నికలే ఇందుకు నిదర్శనం: ఆది శ్రీనివాస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీఆర్‌ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయని, తాజాగా జరిగిన రెండు మున్సిపల్ చైర్మన్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని విప్ ఆది శ్రీనివాస్ ఆరోపించారు. రెండు పార్టీలు కలిసి చైర్మన్ పదవి, వైఎస్ చైర్మన్ పదవి పంచుకున్నాయని ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో రెండు పార్టీలు చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు పంచుకున్నాయని, ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, బీజేపీ దోస్తీ బయటపడిందని ఆయన అన్నారు. బీజేపీకి చైర్మన్ సీటు ఇచ్చి వైస్ చైర్మన్ పదవి బీఆర్ఎస్ తీసుకుందని ఆయన విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తమకు ఎవరితోనూ పొత్తు ఉండదని చెపుతున్నాడని, మరీ ఖానాపూర్, ఇబ్రహీంపట్నంల్లో ఏం జరిగిందో ఆయన తెలియదా అని ప్రశ్నించారు.
మాకు ఎవరితోనూ పొత్తులు లేవని బట్టలు చింపుకున్న కేటీఆర్.. ఇప్పుడు మాత్రం కుక్కిన పేనులా ఉన్నాడని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్య విజయం అంటూ గంభీరమైన ప్రకటనలు చేస్తున్న ఆయన.. ఈ అనైతిక పొత్తుల గురించి మాత్రం నోరు విప్పడం లేదని విమర్శించారు. చైర్మన్ ఎన్నికల్లో పొత్తులపై కేటీఆర్, రాంచందర్ రావు సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గతంలో ఈ రెండు పార్టీలు కలిసి పనిచేశాయని, ఇప్పుడు కూడా కలిసే పనిచేస్తున్నాయని, భవిష్యత్తులోనూ కలిసే పోటీ చేస్తాయని జోస్యం చెప్పారు.
