- మత్తుమందు కలిపిన జ్యూస్ తాగించి అఘాయిత్యం
- వీడియో తీసి బ్లాక్‌మెయిల్, పలుమార్లు లైంగిక దాడి
- మహారాష్ట్రలో దారుణం
నాగ్‌పూర్: మత్తు మందు కలిపిన జ్యూస్ తాగించి ఐఏఎఫ్ ఆఫీసర్ భార్యపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆపై ఫొటోలు, వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగిక దాడి చేశాడు. బెదిరింపులకు పాల్పడుతూ లక్షల్లో క్యాష్ వసూలు చేయడంతో పాటు తనను ఇస్లాం మతంలోకి మార్పించినట్లు బాధితురాలు ఆరోపిస్తున్నారు. మొదటిసారి కిందటేడాది ఫిబ్రవరిలో తనపై అత్యాచారం జరగ్గా, ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు వేధింపులు కొనసాగుతున్నట్లు బాధితురాలు పోలీసులకు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదుతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ పోలీసులు కేసు నమోదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. యువకుడు ఆమెను బలవంతంగా లొంగదీసుకుంటున్నట్లు ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
నిందితుడు గతంలో క్లాస్‌మేట్
నాగ్‌పూర్‌కు చెందిన 24 ఏండ్ల బాధితురాలు ప్రాపర్టీ డీలింగ్ వ్యాపారం చేస్తోంది. ఆమె భర్త ఇండియన్ ఎయిర్‌ఫోర్స్(ఐఏఎఫ్)లో ఆఫీసర్‌గా పనిచేస్తూ మరో సిటీలో ఉంటున్నారు. బాధితురాలికి గతంలో క్లాస్‌మేట్ అయిన అయాజ్ తాజ్ మదర్(26) గతేడాది ఫిబ్రవరిలో స్థలం కొనుగోలు పేరుతో ఆమెను కాంటాక్ట్ అయ్యాడు. మాట్లాడేందుకు నాగ్‌పూర్‌లోని వార్ధా రోడ్డులో ఉన్న ఓ హోటల్‌కు పిలిచాడు. హోటల్ గదికి రాగానే మత్తు మందు కలిపిన జ్యూస్ తాగించి ఆమెపై అయాజ్ అత్యాచారానికి పాల్పడ్డాడు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసి.. బ్లాక్‌మెయిల్ చేసి పలుమార్లు లైంగికంగా వేధించాడు. బెదిరించి రూ.3.09 లక్షల డబ్బు కూడా వసూలు చేశాడు. ఈ వేధింపులు ఆగకపోవడంతో ఇటీవల తిరిగివచ్చిన భర్తకు జరిగిన విషయం తెలియజేసింది. భర్త సూచన మేరకు జూన్ 13న సోనేగావ్ పోలీస్ స్టేషన్‌లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
మత మార్పిడి, పెళ్లి పేరుతో మరోసారి దాడి
తనను ఇస్లాంలోకి మారాలని అయాజ్ ఒత్తిడి తెచ్చాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. రకరకాల మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందిగా బలవంతం చేశాడని ఆరోపించారు. మే నెలలో తనను నాగ్‌పూర్ దగ్గర్లోని కల్మేశ్వర్ ప్రాంతానికి తీసుకెళ్లి అమీన్‌షేక్, అజ్రత్ మౌలానాను పరిచయం చేశాడని వివరించారు. వాళ్లతో కలిసి అక్కడ కొన్ని మతపరమైన కార్యక్రమాలు నిర్వహించి తన మత మార్పిడి పూర్తయిందని ప్రకటించారని, అయాజ్‌తో తనకు పెండ్లి కూడా అయిందని చెప్పారని బాధితురాలు ఆరోపించారు. పెళ్లయిందన్న పేరుతో మరోసారి అయాజ్ అత్యాచారానికి ప్రయత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.
