అనుమానంతో తీసుకెళ్లి.. చిత్రహింసలు పెట్టారు 

అనుమానంతో తీసుకెళ్లి.. చిత్రహింసలు పెట్టారు 

 ట్రైయినీ ఎస్సై చర్యలు  తీసుకోవాలంటూ బాధితుల ఆందోళన
మందమర్రి,వెలుగు: మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుడిపై  ట్రైయినీ ఎస్సై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపిస్తూ బాధిత కుటుంబ సభ్యులు, కాంట్రాక్టు కార్మికులు శనివారం నేషనల్​ హైవేపై రెండు గంటల పాటు ధర్నా నిర్వహించారు. మందమర్రిలోని విద్యానగర్​కు చెందిన చిప్పకుర్తి గట్టయ్య– తిరుమల రెండో కొడుకు చైతన్య(14)  ఈనెల 9న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదు. ఈ విషయమై కుటుంబసభ్యులు10న పోలీసులకు ఫిర్యాదు చేశారు. చైతన్య కనిపించకపోవడానికి ఇంటిపక్కన ఉండే క్యాతన్ పల్లి మున్సిపల్ కాంట్రాక్ట్​కార్మికుడు కాసర్ల కుమార్ కారణమనే అనుమానంతో 11వ తేదీ మధ్యాహ్నం స్టేషన్​కు తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులు కుమార్ పై  ట్రైయినీ ఎస్సై గోకల రమేశ్, మరొకరు కలిసి థర్డ్​ డిగ్రీ ప్రయోగించారని ఆందోళన నిర్వహించారు. దీంతో పోలీసులు కుమార్​ను వదిలేశారు. శుక్రవారం రాత్రి చైతన్య మృతదేహం ఎర్రగుంటపల్లి వాగులో దొరికింది. ఫ్రెండ్స్ తో కలిసి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు వాగులో మునిగి చనిపోయాడని పోలీసులు తెలిపారు. శనివారం మంచిర్యాల హాస్పిటల్ లో పోస్టుమార్టం అనంతరం చైతన్య మృతదేహాన్ని ట్రాక్టర్​లో మందమర్రికి తరలించారు. కుటుంబ సభ్యులు, మున్సిపల్ కార్మికులు మృతదేహంతో బస్టాండ్  ఏరియా పెట్రోల్ పంపు వద్ద రాస్తారోకు నిర్వహించారు. తప్పిపోయిన చైతన్య ఆచూకీ కనుగొనడంలో  పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. 

వైసీపీ లీడర్ ముల్కల రాజేంద్ర ప్రసాద్ కుమారుడితో కలిసిన వెళ్లిన చైతన్య వాగులో మునిగి చనిపోయిన విషయం తెలిసినా.. పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చాడని కాంట్రాక్ట్​ కార్మికుడు కాసర్ల కుమార్​ ఆరోపించారు. వైసీపీ లీడర్​తో కుమ్మకైన ట్రైయినీ ఎస్సై రమేశ్ థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురి చేశాడన్నారు. ట్రైయినీ ఎస్సైని సస్పెండ్​చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, వైసీపీ లీడర్​పై చర్యలు తీసుకోవాలని బాధితుడు కుమార్, మున్సిపల్​ కాంట్రాక్ట్ కార్మిక సంఘం డిస్ట్రిక్ట్​ జనరల్ సెక్రటరీ 
కాసర్ల రాజలింగు డిమాండ్​ చేశారు. మందమర్రి సీఐ ప్రమోద్ రావుతో వాగ్వాదానికి దిగారు. ఎంక్వైరీ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించి  చైతన్య మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. ఈ విషయమై ట్రైయినీ ఎస్సై రమేశ్ మాట్లాడుతూ బాలుడు తప్పిపోయిన విషయమై కుమార్​తో వివరాలు సేకరించామని వివరించారు.