న్యూఢిల్లీ: నిరసనల సందర్భంగా నమోదైన ఎఫ్‌ఐఆర్‌లు, అదుపులోకి తీసుకున్న వారి పూర్తి వివరాలు వెంటనే విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ ఢిల్లీ డీసీపీ సచిన్ శర్మకు మంగళవారం లేఖ రాశారు. తర్వాత పార్లమెంట్ స్ట్రీట్, మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లకు వెళ్లి అక్కడి పరిస్థితిని తెలుసుకున్నారు. విద్యావ్యవస్థ వైఫల్యాలపై సోమవారం జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన నిరసనలో పాల్గొన్న వారిపై పోలీసులు కేసులు పెట్టారని కేజ్రీవాల్ ఆరోపించారు.
బాధితులకు న్యాయ సాయం అందించేందుకు అరెస్టయిన వారి వివరాలు అవసరమని చెప్పారు. మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 17 మందిని అరెస్టు చేశారని, వారిలో ఆరుగురిని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారని కేజ్రీవాల్ ‘ఎక్స్’లో తెలిపారు. అశోక్ విహార్‌లో అదుపులోకి తీసుకున్న 60 మందిని ఇప్పటికే విడుదల చేశారని చెప్పారు. అరెస్టయిన వారి కుటుంబాలకు న్యాయ సాయం, గాయపడిన వారికి వైద్య సహాయం అందించేందుకు ఆప్ ప్రత్యేక హెల్ప్‌లైన్ ప్రారంభించినట్లు వెల్లడించారు.
