హైదరాబాద్, వెలుగు : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్ లోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారని సీఎస్ కె. రామకృష్ణారావు తెలిపారు. ఐదు రోజులపాటు రాష్ట్రంలో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై గురువారం సెక్రటేరియెట్ లో ఉన్నతాధికారులతో సమీక్షించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి విస్తృత ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఆదేశించారు.
కేంద్ర ప్రభుత్వ విభాగాలు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, రాష్ట్రపతి నిలయం అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని సూచించారు. పోలీసు శాఖ తగు భద్రతా, ట్రాఫిక్, బందోబస్త్ ప్రణాళికను రూపొందించాలని, అగ్నిమాపక శాఖ అవసరమైన సిబ్బందితో పాటు తగిన అగ్నిమాపక ఏర్పాట్లు, ఫైర్ టెండర్లను ఏర్పాటు చేయాలని, వైద్య, ఆరోగ్యశాఖ వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
రోడ్డు భవనాల శాఖ విభాగం అవసరమైన బారికేడింగ్‌లు, ఇతర ఏర్పాట్లు చేయాలని, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖల సమన్వయంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాలని, నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా తగు చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులకు స్పస్టం చేశారు. రాష్ట్రపతి నిలయంలో 24 గంటలు స్నేక్ క్యాచర్ బృందాన్ని అందుబాటులో ఉంచాలని సీఎస్ పేర్కొన్నారు.

