20 వేల ఆటోలు అయిపోయినయ్ ..దరఖాస్తుకు పోతే ఆటోలు లేవని సమాధానం

20 వేల ఆటోలు అయిపోయినయ్ ..దరఖాస్తుకు పోతే ఆటోలు లేవని  సమాధానం
  • ఎక్కువ డబ్బులు చెల్లిస్తేనే ఇస్తున్నారంటున్న డ్రైవర్లు  
  • ఫైనాన్షియర్ల ఆఫీసుల వద్దకు డ్రైవర్ల క్యూ 
  • అక్రమాలపై ఒక్క కేసూ నమోదు చేయని ఆర్టీఏ

హైదరాబాద్​సిటీ, వెలుగు: నగరంలో ప్రభుత్వం కేటాయించిన 20 వేల ఆటోలు అమ్మకాలు పూర్తయ్యాయని షోరూమ్​ఓనర్లు చెప్తున్నారు. కొత్త ఆటోల కోసం దరఖాస్తు చేసుకుందామని ఆటో డ్రైవర్లు షోరూమ్ ల వద్దకు పోతే అన్ని ఆటోలు అమ్ముడుపోయాయని, లాగిన్ క్లోజ్​అయ్యిందని తిప్పిపంపుతున్నారు. 

దీంతో ఆటోడ్రైవర్లంతా డీలర్లు, ఫైనాన్షియర్ల ఆఫీసులకు క్యూ కడుతున్నారు. ఎక్కువ చెల్లించేందుకు కూడా సిద్ధపడే వారికి మాత్రమే కొందరు డీలర్లు, ఫైనాన్షియర్లు ఒక్కో పర్మిట్​పై రూ. లక్ష నుంచి 1.20 లక్షల తీసుకుని అమ్ముతున్నారన్న ఆరోపణలున్నాయి. కొందరు షోరూమ్​ల నిర్వాహకులు డీలర్లు, ఫైనాన్షియర్లతో కుమ్మక్కయి పెద్ద సంఖ్యలో పర్మిట్లను బినామీ పేర్లతో కొని పెట్టుకున్నారని తెలుస్తోంది.  

తనిఖీలు చేసినా ఒక్క కేసూ పెట్టలే..

ఆటోల అమ్మకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని కొద్ది రోజుల కింద ఆటో డ్రైవర్లు, సంఘాల లీడర్లు ఆరోపించారు. దీంతో మూడు రోజుల క్రితం రెవెన్యూ, ఆర్టీఏ అధికారులను తూతూమంత్రంగా కొన్ని షోరూమ్​లను తనిఖీ చేసి రికార్డులను తీసుకువెళ్లారు. అయితే, వారు అక్రమాలు జరిగాయని ఎక్కడా ప్రకటించలేదు. ఏ ఒక్క షోరూమ్​నిర్వాహకులపైనా కేసు నమోదు చేయలేదు. 

అధికారుల తనిఖీలు పూర్తయిన మరుసటి రోజు రాత్రి నుంచే లాగిన్​లు క్లోజ్​అయినట్టు షోరూమ్​ల నిర్వాహకులు చెప్తున్నారని, దీన్నిబట్టి అక్రమాల్లో అధికారులకు కూడా భాగస్వామ్యం ఉందని ఆటోడ్రైవర్లు ఆరోపిస్తున్నారు. కేవలం పదిహేను రోజుల్లో 20వేల ఆటో పర్మిట్లు ఎలా అయిపోతాయని ప్రశ్నిస్తున్నారు. పేరుకు నాలుగైదు వేల పర్మిట్లు మాత్రమే ఇచ్చారని, మిగిలినవన్నీ బినామీ పేర్లతో కొందరు ఫైనాన్షియర్లు, డీలర్లు తమ వద్దనే ఉంచుకున్నారని ఆరోపిస్తున్నారు. ఎవరైనా ఎక్కువ ధర ఇస్తామని చెప్తేనే లాగిన్​చేస్తున్నారంటున్నారు. 

మార్కెట్​లో సీఎన్​జీ ఆటో 2.40 లక్షల వరకు ఉండగా, ఫైనాన్సియర్లు రూ.3.40 నుంచి 3.60 లక్షలు తీసుకుంటున్నారని వాపోతున్నారు. ఎల్​పీజీ ఆటోలు రూ.2.30 లక్షలు కాగా, రూ.3.40 నుంచి 3.50 లక్షలు వసూలు చేశారంటున్నారు. కొందరు డీలర్లు, ఫైనాన్షియర్లు దాదాపు 15 వేల వరకు ఆటో పర్మిట్లు బినామీలతో పేరుతో తీసుకున్నారని ఆరోపిస్తున్నారు.  

ఆటో పర్మిట్లలో మాఫియా ప్రవేశం

ప్రభుత్వం పేద ఆటో డ్రైవర్ల జీవనోపాధి కోసం ఓఆర్ఆర్​పరిధిలోని ప్రాంతాల్లో ఆటోలు నడుపుకునేందుకు పర్మిట్లు ఇస్తూ జీవో విడుదల చేసింది. ఇందులో10వేలు సీఎన్​జీ, మరో 10 వేల ఎల్​పీజీ ఆటోలు కాగా, మరో 20 వేలు ఎలక్ట్రిక్​ ఆటోల పర్మిట్లను ఇచ్చేందుకు అనుమతించింది. అయితే, ఆటో కొనాలనుకున్న వారు షోరూమ్​ల ద్వారానే లాగిన్​అయి దరఖాస్తు చేసుకోవాలి. దీంతో కొందరు షోరూమ్​ల వారు, డీలర్లు, ఫైనాన్షియర్లు మాఫియాగా ఏర్పడి కోట్ల రూపాయలు దండుకుంటున్నారు.

 దీంతో ఆటో పర్మిట్లన్నీ డీలర్స్, పెద్ద ఫైనాసర్స్ గుప్పిట్లోకి వెళ్లిపోయాయంటున్నారు. మొదట్లో కొందరికి ఆన్​లైన్​లో దరఖాస్తులతో పర్మిట్లను ఇచ్చినా తర్వాత బ్లాక్ లో పర్మిట్లను విక్రయించే స్థాయికి పరిస్థితి దిగజారింది. ఒక్కో ఆటోపై రూ.లక్ష వరకు అదనంగా తీసుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. ఇన్ని ఆరోపణలు వస్తున్నా రవాణా శాఖ అధికారులు మాత్రం మౌనంగా ఉండడం పై అనుమానాలు కలుగుతున్నాయని ఆటోడ్రైవర్లు అంటున్నారు. 

ఇప్పటి వరకూ లాగిన్​అయి ఇచ్చిన పర్మిషన్లపై విచారణ జరపాలని, షోరూమ్​లకే కాకుండా ఎక్కడి నుంచయినా లాగిన్​ అయ్యే అవకాశం కల్పించాలని తెలంగాణ స్టేట్​ఆటో అండ్​ట్యాక్సీ డ్రైవర్స్​ అసోసియేషన్​ అధ్యక్షుడు నంద కిషోర్​, ప్రధాన కార్యదర్శి పెంటయ్యగౌడ్​, భారతీయ ప్రైవేట్​ ట్రాన్స్​పోర్ట్​ మజ్ధూర్​సంఘ్​ ప్రధాన కార్యదర్శి రవిశంకర్​ ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు.