గర్భగుడిలోకి హనుమంతుడు!

గర్భగుడిలోకి హనుమంతుడు!

లక్నో: అయోధ్యలో అద్భుత సన్నివేశం జరిగింది. మంగళవారం సాయంత్రం గర్భగుడిలోకి కోతి వచ్చింది. ‘ఆ హనుమంతుడే రామయ్యను దర్శించుకోవడానికి వచ్చాడా అన్నట్టుగా అనిపించింది’ అని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు పేర్కొంది. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. ‘‘అయోధ్య ఆలయంలో అద్భుత సన్నివేశం జరిగింది. మంగళవారం సాయంత్రం 5:50 గంటలకు ఓ కోతి గర్భగుడిలోకి ప్రవేశించింది.

అది గర్భగుడిలో ఉన్న ఓల్డ్ రామ్ లల్లా విగ్రహం దగ్గరి వరకు వెళ్లింది. ఒకవేళ విగ్రహాన్ని పడేస్తుందేమోనని భద్రతా సిబ్బంది ఒకరు కోతి వైపు వెళ్లగా, అది ఏమీ అనకుండా అక్కడి నుంచి ఉత్తర ద్వారం వైపు వెళ్లింది. ఆ తలుపు మూసి ఉండడంతో భక్తుల మధ్య నుంచి ఆ కోతి వెళ్లిపోయింది. ఎవరికీ ఎలాంటి హానీ చేయలేదు. రాముడిని చూసేందుకు ఆ హనుమతుండే స్వయంగా వచ్చినట్టు అనిపించిందని భద్రతా సిబ్బంది పేర్కొన్నారు” అని పోస్టులో రామ జన్మభూమి ట్రస్టు తెలిపింది.