చెన్నై: ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థలు 12 ఏళ్లుగా ఇంకా విభజనకు నోచుకోలేదని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలనీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం (ఆగస్ట్ 20) దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సమావేశమయ్యారు. తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా కోవళంలో జరిగిన ఈ సమావేశంలో డీలిమిటేషన్, రాష్ట్రాల మధ్య సమన్వయం, భద్రత, కేంద్ర–రాష్ట్ర అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఏపీ సహా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి ప్రస్తావించారు. కేంద్రం–రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలన్నారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు ప్రతిపాదించారు. అమరావతి–బెంగళూరు–చెన్నై నగరాలను అనుసంధానించే రవాణా వ్యవస్థ ఉండాలని కోరారు.
దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించాలని కేంద్రానికి సూచించారు. దక్షిణాది రాష్ట్రాల యూనివర్సిటీలు, స్కిల్లింగ్ సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని కోరారు. విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటును ప్రపోజ్ చేశారు.
తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలని కోరారు.
దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉందన్నారు. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని అంచనా వేశారు. వికసిత్ భారత్ నిర్మాణంలో దక్షిణాది కీలక ఆర్థిక శక్తిగా ఎదగాలనీ ఆకాక్షించారు.
అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించాం:
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించామని తెలిపారు. పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు కేంద్ర సహకారంతో సాకారం అవుతున్నట్లు పేర్కొన్నారు. దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలని కేంద్రాన్ని కోరారు. అలాగే, కడప జేఎస్‌డబ్ల్యూ రైల్వే లింక్‌కు, విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. గోదావరి–కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదన చేశారు.
గోదావరి–కావేరి అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కలిసి నదీ జలాలపై సమన్వయంతో ముందుకు సాగాలని సూచించారు. గంగా–కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలన్నారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమన్నారు.
