కేసీఆర్ గతమంతా  అవినీతి, అక్రమాలే: కేంద్రమంత్రి బండి సంజయ్

కేసీఆర్ గతమంతా  అవినీతి, అక్రమాలే: కేంద్రమంత్రి బండి సంజయ్
  • భూకబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలి
  • ప్రజల్ని మభ్యపెట్టడంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూ దొందే 
  • దానంపై హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్య 
  • విజయం: కేంద్ర మంత్రి బండి సంజయ్



 
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్​ నేతల భూ కబ్జాలకు సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని అసెంబ్లీలో స్వయంగా సీఎం చెప్పారని కేంద్రమంత్రి బండి సంజయ్​ పేర్కొన్నారు. అలాంటప్పుడు బాధ్యులపై చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ నేతలు సిద్దిపేటలో డ్రామాలు ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించారు. ‘‘అసలు మీ దగ్గర నిజంగా ఆధారాలున్నాయా? లేదంటే రాజకీయ లబ్ధి కోసం ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారా?’’ అని ప్రభుత్వాన్ని నిలదీశారు. శుక్రవారం మీడియాకు బండి సంజయ్‌‌‌‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

ఆరు గ్యారంటీల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్ కుటుంబంతో సహా భూ కబ్జాలకు పాల్పడిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకునే దమ్ము మీకుందా? అసెంబ్లీలో సెట్ వేసి కేసీఆర్‌‌‌‌‌‌‌‌తో డీల్ సెట్ చేసుకున్నారా? ’’ అని ప్రశ్నించారు. కేసీఆర్ పుట్టుకతోనే వందల ఎకరాల యజమాని కాదని, ఆయన గతమంతా అవినీతి, అక్రమాలేనని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ దొందూ దొందేనని, పరస్పర ఆరోపణలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్ అక్రమాలపై విచారణ జరిపిస్తామని, ఆ భూముల్లో కాషాయ జెండాలు పాతి పేదలకు పంచుతామని పేర్కొన్నారు. 

ఇండ్ల మంజూరుపై హర్షం..

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ గ్రామీణ ప్రాంతాలకు కేంద్రం మరో 2 లక్షల ఇండ్లు మంజూరు చేయడంపై బండి సంజయ్ హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటనపై ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు రాకుండా అడ్డుకోవడమే కాకుండా.. కేంద్రం ఇచ్చిన నిధులను సైతం దారి మళ్లించిందని ఆరోపించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా సొంత పార్టీ కార్యకర్తలకు కాకుండా, అర్హులైన పేదలకే ఈ ఇండ్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. 

ఫిరాయింపుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలి

దానం నాగేందర్‌‌‌‌‌‌‌‌పై హైకోర్టు అనర్హత వేటు వేయడం ప్రజాస్వామ్యానికి దక్కిన విజయమని బండి సంజయ్ పేర్కొన్నారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించకపోవడం శాసనసభ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని అన్నారు. రాజ్యాంగ పుస్తకం చేతపట్టుకున్నంత మాత్రాన రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షకుడు కాలేరని, ప్రజాస్వామ్య విలువలను కాపాడే చిత్తశుద్ధి ఉండాలని అన్నారు. శాసనసభ పరువు కాపాడేందుకు రాజకీయాలకతీతంగా స్పీకర్ వ్యవహరించాలని, ఫిరాయింపుదారులపై  చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌ చేశారు.