ఇవాళ్టి (సెప్టెంబర్ 19) నుంచి ఆసియా గేమ్స్.. ఇండియా నుంచి బరిలోకి 501 మంది, 43 క్రీడాంశాల్లో పోటీలు

ఇవాళ్టి (సెప్టెంబర్ 19) నుంచి ఆసియా గేమ్స్.. ఇండియా నుంచి  బరిలోకి 501 మంది, 43 క్రీడాంశాల్లో పోటీలు

ఓవరాల్‌‌గా 45 దేశాల నుంచి 11 వేల మంది అథ్లెట్లు
మ. 2.30 నుంచి ఓపెనింగ్‌‌ సెర్మనీ సోనీ స్పోర్ట్స్‌‌లో లైవ్‌‌ 

నగోయా: ప్రతిష్టాత్మక 20వ ఆసియా క్రీడలకు ఇండియా అథ్లెట్లు రెడీ అయ్యారు. శనివారం (సెప్టెంబర్ 19) నుంచి జరిగే పోటీల్లో పతకాలే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నారు. రాబోయే పదేళ్లలో ప్రపంచంలోని టాప్‌‌–10 దేశాల సరసన చోటు సంపాదించాలన్న ఏకైక ఉద్దేశంతో ఏషియాడ్‌‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. ఇండియా తరఫున మొత్తం 501 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అయితే ఇక్కడికి చేరినప్పట్నించి ఇండియన్‌‌ అథ్లెట్లకు పరిస్థితులు అనుకూలంగా లేవు. వసతి ఏర్పాట్లలో గందరగోళం, కేటాయించిన గదులు ఇరుకుగా ఉండటం, ప్లేయర్ల అవసరాలు తీర్చే విధంగా లేకపోవడంతో అథ్లెట్లు కాస్త అసంతృప్తితో ఉన్నారు. 

అయితే క్రీడలు అధికారికంగా ప్రారంభమైన తర్వాత పరిస్థితులు చక్కబడతాయని ఆతిథ్య జపాన్‌‌ ఆశాభావం వ్యక్తం చేస్తోంది. పరిస్థితులు ఎలా ఉన్నా.. ఈ పోటీల్లో పతకాల సంఖ్యకు మాత్రమే పరిమితం కాకుండా అంతకు మించిన లక్ష్యాలతో ఇండియా ఈ క్రీడల్లో అడుగుపెడుతోంది. 2022 హంగ్జౌలో జరిగిన క్రీడల్లో ఇండియా రికార్డు స్థాయిలో 106 పతకాలు సాధించింది. ఆసియా ఖండ స్థాయి క్రీడల్లో దేశం సాధించిన అత్యధిక మెడల్స్‌‌ సంఖ్య ఇదే కావడం గమనార్హం. కేవలం కొన్ని సంప్రదాయ క్రీడాంశాలపైనే ఆధారపడకుండా.. వివిధ క్రీడా విభాగాల్లో నిలకడగా పోటీపడే సామర్థ్యం ఇండియన్స్‌‌కు ఉందని ఇక్కడ నిరూపితమైంది. ఇప్పుడు అదే ఊపును కొనసాగించడానికి నగోయా మరో అవకాశాన్ని ఇచ్చింది. ఓవరాల్‌‌గా ఈ పోటీల్లో 45 దేశాల నుంచి11 వేల మంది అథ్లెట్లు 43 క్రీడాంశాల్లో పోటీపడనున్నారు. 

షూటింగ్‌‌, ట్రాక్‌‌ అండ్‌‌ ఫీల్డ్‌‌ పైనే దృష్టి..

రెండుసార్లు ఒలింపిక్‌‌ మెడలిస్ట్‌‌ మను భాకర్‌‌ నేతృత్వంలోని 30 మంది షూటర్లతో ఇండియా బలమైన పోటీ ఇచ్చేందుకు రెడీగా ఉంది. రైఫిల్‌‌, పిస్టల్‌‌, షాట్‌‌ గన్‌‌ విభాగాల్లో తగినన్ని వనరులు ఉన్నాయి. చైనా నుంచి తీవ్ర పోటీ ఉన్నా ఇండియన్లు  కచ్చితంగా పతకాలు సాధిస్తారని ఆశిస్తున్నారు. స్టార్‌‌ జావెలిన్‌‌ త్రోయర్‌‌ నీరజ్‌‌ చోప్రా లేకపోవడం ఇండియాకు అతిపెద్ద ఎదురుదెబ్బ. గాయం కారణంగా అతను ఈ టోర్నీకి దూరమయ్యాడు. దాంతో వరుసగా మూడోసారి ఏషియాడ్‌‌లో గోల్డ్‌‌ గెలిచే చాన్స్‌‌ మిస్సయ్యాడు. ట్రాక్‌‌ అండ్‌‌ ఫీల్డ్‌‌లో మొత్తం 74 మంది అథ్లెట్లు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. తజిందర్‌‌ పాల్‌‌ సింగ్‌‌ తూర్‌‌ (షాట్‌‌ఫుట్‌‌), మురళీ శ్రీశంకర్‌‌ (లాంగ్‌‌ జంప్‌‌), గుల్వీర్‌‌ సింగ్‌‌, రోహిత్‌‌ యాదవ్‌‌, తేజస్విన్‌‌ శంకర్‌‌, ఆన్సీ సోజన్‌‌, సర్వేశ్‌‌ కుషారే, జ్యోతి ఎర్రాజీ, ప్రవీణ్‌‌ చిత్రవేల్‌‌ పతకాలపై గురి పెట్టారు. 

బ్యాడ్మింటన్‌‌లో పతకం ఖాయమేనా?

ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్‌‌పై కూడా అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి. పీవీ సింధు, ఉన్నతి హుడా, సాత్విక్‌‌ సాయిరాజ్‌‌–చిరాగ్‌‌ షెట్టి జోడీ పతకంపై భారీ ఆశలు పెట్టుకున్నారు. ఇక హర్మన్‌‌ప్రీత్‌‌ కౌర్‌‌ నేతృత్వంలోని క్రికెట్‌‌ జట్టు ఇప్పటికే సెమీస్‌‌లోకి ప్రవేశించింది. 2028 లాస్‌‌ ఏంజిల్స్‌‌ ఒలింపిక్స్‌‌లో క్రికెట్‌‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇక్కడ పతకం గెలవడం చాలా కీలకంగా మారింది. ఏషియాడ్‌‌లో ఇండియా హాకీకి మంచి రికార్డు ఉంది. కెప్టెన్‌‌ హర్మన్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌ సారథ్యంలోని ఇండియా జట్టు ఇక్కడ స్వర్ణం గెలిచి డైరెక్ట్‌‌గా ఒలింపిక్స్‌‌కు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జరగాలంటే వరల్డ్‌‌ కప్‌‌, ప్రొ లీగ్‌‌లో ఎదురైన పరాజయాల నుంచి బయటకు వచ్చి సత్తా చాటాలి. హాంగ్జౌలో సాధించిన కాంస్యాన్ని మెరుగుపర్చుకోవాలని విమెన్స్‌‌ టీమ్‌‌ భావిస్తోంది. ఆర్చరీ, బాక్సింగ్‌‌, కబడ్డీలో కూడా ఇండియాకు పతకాలు గెలిచే సత్తా ఉంది.  
 
ఫ్లాగ్‌‌ బేరర్స్‌‌గా మను, తజిందర్‌‌

శనివారం జరిగే ఆసియా క్రీడల ప్రారంభో త్సవంలో స్టార్‌‌ షూటర్‌‌ మను భాకర్‌‌, షాట్‌‌ఫుటర్‌‌ తజిందర్‌‌ పాల్‌‌ సింగ్‌‌ తూర్‌‌ ఫ్లాగ్‌‌ బేరర్స్‌‌గా వ్యవహరించనున్నారు. మరోవైపు క్రీడల్లో ఇండియా సహా ఆరు దేశాల జెండా ఆవిష్కరణ కార్యక్రమం గంటకు పైగా ఆలస్యమైంది. ఒలింపిక్ కౌన్సిల్‌‌ ఆఫ్‌‌ ఏషియా (ఓసీఏ), స్థానిక నిర్వాహకుల మధ్య సమన్వయ లోపం వల్ల ఈ సమస్య తలెత్తింది. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు వేడుక జరగాల్సి ఉంది. సమాచా ర లోపం వల్ల యెమెన్‌‌, నార్త్‌‌ కొరియా, పాలస్తీనా, ఇండియా, చైనీస్‌‌తైపీ, తూర్పు తైమోర్‌‌ దేశాల ప్రతినిధులను స్టేజ్‌‌పైకి రాకుండా నిర్వాహకులు ఆపేశారు. తర్వాత పరిస్థితిని చక్కదిద్దడంతో ఇండియా ప్రతినిధులు అంజలి భాగవత్‌‌, లిజో డేవిడ్‌‌ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.