అగార్కర్ భవిష్యత్పై బోర్డుదే నిర్ణయం

అగార్కర్ భవిష్యత్పై బోర్డుదే నిర్ణయం

ముంబై:  చీఫ్‌‌ సెలెక్టర్‌‌ అజిత్‌‌ అగార్కర్‌‌ పదవీకాలాన్ని పొడిగించాలా? వద్దా? అనే అంశంపై బీసీసీఐ కార్యవర్గమే నిర్ణయం తీసుకోనుంది. ఈ మేరకు శుక్రవారం జరిగిన జనరల్‌‌ బాడీ మీటింగ్‌‌లో నిర్ణయ బాధ్యతలను బోర్డుకే అప్పగించారు. అక్టోబర్‌‌ 4తో అగార్కర్‌‌ పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 2027లో జరగనున్న ఐపీఎల్‌‌ 20వ ఎడిషన్‌‌ను అత్యంత ఘనంగా నిర్వహించాలని జనరల్‌‌ బాడీ ఏకగ్రీవంగా నిర్ణయించింది.

2028లో బీసీసీఐ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించేందుకు గాను డిసెంబర్ 2027 నుంచి ఏడాదిపాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. అరుణ్ ధుమాల్, ఖైరుల్ జమాల్ మజుందార్‌‌లు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్‌‌కు మళ్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంపైర్లు, మ్యాచ్ రిఫరీల వేతన స్కేల్‌‌ను పెంచుతూ బోర్డు ఆమోదం తెలిపింది.

ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌‌కు ఆమోదం తెలపడంతో పాటు, వయస్సు మోసాలను అరికట్టేందుకు ఏజ్ వెరిఫికేషన్ పాలసీని బీసీసీఐ సవరించింది. రాంచీ వేదికగా జరగాల్సిన ఇండియా–-ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్ మార్పుపై ఎలాంటి చర్చ జరగలేదని జేఎస్‌‌సీఏ స్పష్టం చేసింది.