- ఒప్పిస్తే అందరం కలిసి మహారాష్ట్రకు వెళ్దామన్న మంత్రి శ్రీధర్‌బాబు
- కేంద్రం 10 శాతం సహకరించినా తుమ్మిడిహెట్టి పూర్తవుతుందన్న ఉత్తమ్
- తుమ్మిడిహెట్టి కట్టాల్నా వద్దా బీజేపీ చెప్పాలని భట్టి డిమాండ్
- నాడు అధికారంలో ఉన్నా కాంగ్రెస్ ఏం చేయలేకపోయిందని ఏలేటి కౌంటర్
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీలో శక్రవారం ఎల్‌నినో అంశంపై జరిగిన చర్చ సందర్భంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుపై అధికార కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తుమ్మిడిహెట్టి విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని, మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎందుకు ఒప్పించడం లేదని మంత్రులు నిలదీయగా..కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఏం చేశారంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తిప్పికొట్టారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కట్టి తీరుతామని, కేంద్రం 10 శాతం సహకరించినా ఇది పూర్తవుతుందని తెలిపారు. పోలవరం కోసం ఏపీకి 2 లక్షల ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమైన కేంద్రం.. తుమ్మిడిహెట్టి కోసం మహారాష్ట్రలో 2 వేల ఎకరాలు ఇప్పించేందుకు ఎందుకు వెనకడుగు వేస్తోందని ప్రశ్నించారు. గతంలో బీఆర్ఎస్, బీజేపీలు భద్రాచలంలోని ఏడు మండలాల విషయంలోనూ మౌనంగా ఉన్నాయని విమర్శించారు.
దీనిపై ఏలేటి మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. 2004, 2009లో కేంద్రంలో, మహారాష్ట్రలో, ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్నాయని, అప్పట్లోనే తుమ్మిడి హెట్టి ప్రాజెక్టును ఎందుకు సాధించలేదని కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు కేంద్రాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. కాళేశ్వరం రిపేర్లు చేయకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ వాదనల మధ్య డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జోక్యం చేసుకుంటూ..ప్రాజెక్టుకు సహకరించకుండా కేవలం అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మా మీద పడి ఏడిస్తే ఏమొస్తది
కాంగ్రెస్ పదేండ్లు అధికారంలో ఉండి ఏం చేయలేక ఇప్పుడు తమపై విమర్శలు చేస్తే ఏమొస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి నిలదీశారు. ఎన్‌డీఎస్ఏ సిఫారసులు చేసినా కాళేశ్వరం బ్యారేజీల విషయంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించగా.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్‌డీఎస్ఏ 600 పేజీల నివేదిక ప్రకారం టెక్నికల్‌గా ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. మంత్రి శ్రీధర్ బాబు జోక్యం చేసుకుంటూ.. ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ప్రధాని వద్దకు వెళ్లి తుమ్మిడిహెట్టిపై ఎందుకు విజ్ఞప్తి చేయడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వానికి ప్రాజెక్టు కట్టే ఉద్దేశం, పైసలున్నాయా అని ఏలేటి అనగా.. ఇరిగేషన్ శాఖకు రూ.25 వేల కోట్ల బడ్జెట్ ఉందని, ప్రాజెక్టును కచ్చితంగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ బదులిచ్చారు.
ఇందిరమ్మ టవర్స్ లో రూల్స్ పాటించలే: దానం
అసెంబ్లీ జీరో అవర్ కు ప్రాధాన్యత లేదని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. నోట్ చేసుకున్నామని మంత్రులు చెబుతున్నారని సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారుల నుంచి ఆన్సర్ మాత్రం రావట్లేదని మండిపడ్డారు. శుక్రవారం అసెంబ్లీలో జీరో అవర్ సందర్భంగా దానం మాట్లాడారు. “ఇందిరమ్మ టవర్స్ లాటరీలో నా నియోజకవర్గంలో ఇతర నియోజకవర్గాలకు ప్లాట్స్ దక్కాయి. ఏ నియోజకవర్గంలో ప్రజలకు అక్కడే ఫ్లాట్స్ దక్కాలని స్కీమ్ తీసుకొచ్చారు.
ఎంఐఎం ఎమ్మెల్యేలను అడిగితే బయట వాళ్లకు మా దగ్గర రాలేదని చెప్పారు. అధికారులు ఎంఐఎం ఎమ్మెల్యేలు అంటే భయపడుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి 480 ఫ్లాట్స్ కేటాయించారు. ఎమ్మెల్యే రాకముందే అధికారులు లాటరీ తీశారు. సర్వేలో అధికారులు తప్పు చేశారు. ఈ అంశాన్ని మంత్రి పొంగులేటి దృష్టికి తీసుకెళ్లిన. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అధికారులు పాటించలేదు” అని దానం నాగేందర్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ ఇన్ చార్చి మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ ఎమ్మెల్యేలతో మీటింగ్ నిర్వహించి ఇందిరమ్మ టవర్స్ అంశంపై చర్చిస్తామన్నారు.
నిరాహార దీక్ష చేస్త: ఎమ్మెల్యే కవ్వంపల్లి
మా నియోజకవర్గంలో రోడ్ల పరిస్ధితి బాలేదని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ రోడ్లు బాలేదన్నారు. పనులు మంజూరైయినా కాంట్రాక్టర్లు ముందుకు రావటం లేదన్నారు. బిల్లులు రాకపోవటంతోనే వర్క్ స్టార్ట్ చేయటం లేదని కాంట్రాక్టర్లు చెబుతున్నారన్నారు. డిప్యూటీ సీఎం వెంటనే జోక్యం చేసుకొని పెండింగ్ బిల్లులు రిలీజ్ చేయాలన్నారు. గుండ్లపల్లి నుంచి పొత్తూరు వరకు రోడ్ వేయించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని హెచ్చరించారు.
ప్రాజెక్టును కడదామా? వద్దా?: భట్టి
152 మీటర్ల ఎత్తుతో తుమ్మిడిహెట్టి నిర్మించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. వైఎస్సార్ హయాంలో రూపొందిన ఈ ప్రాజెక్టును పక్కనబెట్టి, బీఆర్ఎస్ ప్రభుత్వం కాళేశ్వరం కట్టి ప్రజాధనం వృథా చేసిందని విమర్శించారు. పోలవరం కోసం ఏపీకి 2 లక్షల ఎకరాలు ఇచ్చేందుకు సహకరించిన బీఆర్ఎస్, బీజేపీలు.. తుమ్మిడిహెట్టి వద్ద కేవలం 2,000 ఎకరాల ముంపు సమస్యను మహారాష్ట్రతో ఎందుకు పరిష్కరించలేకపోయాయని నిలదీశారు.ప్రాజెక్టును కడదామా? వద్దా? అనేదానిపై బీజేపీ తమ వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఎక్కువ పరిహారం ఇచ్చి ఆదుకుంటామని.. బీజేపీ నేతలు కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి అనుమతులు తేవాలని డిప్యూటీ సీఎం కోరారు.
