భూముల వివరాలన్నీ అఫిడవిట్లలోనే ఉన్నయ్‌‌‌‌ : ఎమ్మెల్యే హరీశ్ రావు

భూముల వివరాలన్నీ అఫిడవిట్లలోనే ఉన్నయ్‌‌‌‌ : ఎమ్మెల్యే హరీశ్ రావు
  • నా రాజకీయ జీవితం తెరచిన పుస్తకం: హరీశ్‌‌‌‌రావు
  • కాంగ్రెసోళ్లు వస్తే దగ్గరుండి వ్యవసాయ క్షేత్రం చూపిస్తానని వెల్లడి

సిద్దిపేట, వెలుగు: 22ఏ వల్ల ప్రజల ఇబ్బందులపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతోందని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీల బృందం తన భూములను చూసేందుకు వచ్చారని, తనకు చెప్తే తానే వారికి భూములను చూపించేవాన్నన్నారు. శుక్రవారం సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో బైండ్ల కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో, ఆ తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

తాను 2018 నుంచి 2014 వరకు విడతలవారీగా కొన్న భూమి 13.12 ఎకరాలు అని, సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని దరఖాస్తు చేసుకుంటే.. సర్వే చేసిన అధికారులు 13.10 ఎకరాలు మాత్రమే తన స్వాధీనంలో ఉందని తేల్చినట్టు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు అక్కడ తనకు అధునాతన ఫామ్ హౌస్‌‌‌‌​ఏమీ లేదని తెలిపారు. తన భూముల వివరాలను ఎన్నికల అఫిడవిట్‌‌‌‌లోనే సర్వే నంబర్లతో సహా పొందుపరిచానని వెల్లడించారు. తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమని పేర్కొన్నారు. రామంచ వద్ద భూమిని కొనుక్కుంటే దానిని వివాదం చేస్తున్నారని, కాంగ్రెస్ నేతల్లా తాను కబ్జాలు పెట్టలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వెలికట్ట దగ్గర తన కుటుంబసభ్యులు నిబంధనల ప్రకారం భూమి కొన్నారని, దీనిపై అప్పుడు భూమిని అమ్మిన ఎక్స్ సర్వీస్‌‌‌‌మెన్‌‌‌‌లను విచారించుకోవచ్చన్నారు.

తన భూమికి సంబంధించి చిన్న తప్పు ఉందని నిరూపించినా.. దానిని ప్రభుత్వానికే వదిలేస్తానని ఆయన సవాల్ చేశారు. నిషేధిత జాబితాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించడం, సీఎంతో పాటు ఆయన తమ్ముళ్లు, మంత్రి పొంగులేటి భూ బాగోతాలను ప్రజల్లో బయటపెట్టడం వల్లే తమపై ఎదురుదాడికి దిగుతున్నారని హరీశ్‌‌‌‌ రావు విమర్శించారు. కేసీఆర్ దగ్గర దళితుల భూమి ఉందని నిరూపిస్తే తామంతా రాజీనామా చేస్తామన్నారు. ఒకవేళ రుజువు చేయకపోతే రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయడానికి సిద్ధమా అని సవాల్ చేశారు.