- వచ్చే వేసవి వరకు వాటిని కాపాడుకోవాలి
- ఇన్ ఫ్లో ఆధారంగా సాగు అవసరాలకు ఇస్తం
- ఎల్‌నినోపై రాజకీయాలు చేయడం ఆపండి
- అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: ఎల్‌నినోపై రాజకీయాలు చేయడం ఆపాలని విపక్షాలకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించారు. రాష్ట్రంపై ఎల్ నినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని.. దీని ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. ‘వర్షాలు లేకపోవడం వల్ల సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతుల బాధలు మేము అర్థం చేసుకోగలం.. కానీ తాగునీటికే మా తొలి ప్రాధాన్యం’ అని మంత్రి ప్రకటించారు. గోదావరి, కృష్ణా బేసిన్లలోని రిజర్వాయర్లలో నీటి మట్టాలు వేగంగా పడిపోతున్నాయని, వచ్చే వేసవికాలం వరకు నీళ్లను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరద ప్రవాహాలను బట్టి సాగునీటి సరఫరాపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి స్పష్టంచేశారు.
అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఎల్ నినోపై సభలో చేపట్టిన సల్పకాలిక చర్చను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎల్ నినో కారణంగా ఈసారి కరువు తప్పదని శాస్త్రవేత్తలు ముందుగానే తెలిపారని, అందువల్లే వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు చెప్పామని గుర్తుచేశారు.
కృష్ణా, గోదావరి బేసిన్‌లో ఉన్నవి 241 టీఎంసీల నీళ్లే
ఎల్ నినో కారణంగా వర్షాలు పడక రిజర్వాయర్లలో నీటి నిల్వలు తగ్గిపోయాయని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ప్రస్తుతం గోదావరి, కృష్ణా బేసిన్లలోని అన్ని రిజర్వాయర్లలో కలిపి 585 టీఎంసీలకు కేవలం 241 టీఎంసీల నీళ్లే ఉన్నాయని అసెంబ్లీలో వెల్లడించారు. గతేడాది ఇదే సమయానికి కృష్ణా బేసిన్‌లో 361 టీఎంసీలకు గాను 333 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా ఈ ఏడాది సెప్టెంబర్ 17 నాటికి కేవలం 120 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నట్లు తెలిపారు. గోదావరి బేసిన్‌లో మొత్తం 284 టీఎంసీలకుగాను గతేడాది 164 టీఎంసీల నీళ్లు ఉంటే ఈ ఏడాది కేవలం 121 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయన్నారు.
‘గతేడాది ఇదే సమయానికి శ్రీశైలంలో 153.56 టీఎంసీలు ఉండగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులో కేవలం 61 టీఎంసీలే ఉన్నాయి. నాగార్జున సాగర్‌లో గతేడాది 174 టీఎంసీలు ఉంటే.. ఇప్పుడు 44 టీఎంసీలే ఉన్నాయి. శ్రీరామ్ సాగర్‌లో గతేడాది 65 టీఎంసీలు ఉంటే ఇప్పుడు కేవలం 31 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఎస్సారెస్పీలో 49 శాతం నీళ్లు తక్కువగా ఉన్నాయి. గతేడాది ఈ సమయానికి కృష్ణా గోదావరి బేసిన్‌లో 500 టీఎంసీల నీరుంటే, ఇప్పుడు 241 టీఎంసీల నీరే ఉంది.. గత ఏడాదికన్నా సగానికి సగం నీరు తగ్గిపోయింది’ అని మంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో మొత్తం 44 వేల 34 చెరువులు ఉండగా 40 శాతం చెరువులు సగం కూడా నిండలేదన్నారు.18 శాతం చెరువులు మాత్రమే 70 నుంచి 100 శాతం నిండినట్లుగా మంత్రి తెలిపారు. ఈ నీళ్లను వచ్చే వేసవికాలం వరకు తాగునీటి అవసరాల కోసం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించారు.
బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్తున్నరు
తెలంగాణ భూములను బీళ్లుగా మారుస్తూ ఆంధ్రా వాళ్లకు నీళ్లను పంపిస్తున్నామంటూ బీఆర్ఎస్ నాయ కులు చేస్తున్నది తప్పుడు ప్రచారం అని మంత్రి ఉత్తమ్చెప్పారు. ఈ ఏడాది జూన్ 1 నుంచి సెప్టెంబర్ 17 వర కు గడిచిన 4 నెలల్లో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఏపీ 52 టీఎంసీల నీళ్లు తీసుకుంటే తెలంగాణ 84 టీఎంసీలు, నాగార్జున సాగర్‌లో ఏపీ 17.2 టీఎంసీలు తీసుకుంటే తెలంగాణ 23.61 టీఎంసీల నీటిని వినియోగించుకున్నట్టు మంత్రి వివరించారు. బీఆర్ఎస్ తొమ్మిదన్నరేండ్ల ప్రభుత్వంలో కంటే తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే కృష్ణా, గోదావరి బేసిన్‌లో వాటర్‌ను రికార్డు స్థాయిలో వినియోగించుకున్నట్టు చెప్పారు. గోదావరి బేసిన్‌లో 2025–26లో అత్యధికంగా 340.39 టీఎంసీలు, కృష్ణా బేసిన్‌లో 2024–25లో 286 టీఎంసీల నీటిని రికార్డు స్థాయిలో వాడుకున్నామని తెలిపారు. ఎల్‌నినో వంటి కష్టకాలంలో రైతులను తప్పుదారి పట్టించేలా బీఆర్ఎస్ నేతలు అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటని మంత్రి మండిపడ్డారు. రాజకీయాల కోసం తప్పుడు ప్రకటనలు చేయడం తగదన్నారు. కృష్ణా, గోదావరి బేసిన్లలో రాష్ట్రానికి దక్కా ల్సిన న్యాయమైన నీటి వాటా కోసం ట్రిబ్యునల్‌లలో, కోర్టులలో ప్రభుత్వం కొట్లాడుతున్నదని చెప్పారు.
అక్టోబర్‌లో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లు
రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇరిగేషన్ శాఖలో 1.80 లక్షల కోట్లు ఖర్చు చేసినా వెయ్యి ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లందించలేదని మంత్రి ఉత్తమ్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీ ఫౌండేషన్ నిర్మాణంలోనే తప్పులు జరిగాయని మంత్రి అసెంబ్లీలో ప్రకటించారు. డీపీఆర్‌లో షీట్ ఫైల్స్‌తో ఫౌండేషన్ వేయాలని సూచిస్తే సీకెంట్ ఫైల్స్ వేశారని దీనివల్ల ఫౌండేషన్ భూమిలోకి దిగి మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిందన్నారు. ఈ విషయాన్ని ‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)’ గుర్తించి ‘పూర్ డిజైన్.. పూర్ కన్స్ట్రక్షన్’ అని రిపోర్ట్ ఇచ్చిందని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయి కంపెనీలతో టెస్టింగ్ జరిపి రిపోర్టులు తీసుకున్నామని, వచ్చే అక్టోబర్‌లో కాళేశ్వరం బ్యారేజీల రిపేర్లను ప్రభుత్వం స్టార్ట్ చేస్తుందని మంత్రి వెల్లడించారు. ‘గత ప్రభుత్వం కాళేశ్వరంతో పాటు పాలమూరు– రంగారెడ్డి, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా లాంటి ఎత్తిపోతల పథకాలను సమర్థవంతగా నిర్మించినట్లయితే ఎల్‌నినో లాంటి కరువు పరిస్థితులను చాలా ఈజీగా జయించేవాళ్లమని’ మంత్రి చెప్పారు. గోదావరి బేసిన్‌లో తుమ్మిడిహెట్టి వంటి ప్రాజెక్టును పక్కకు పెట్టడం, కృష్ణా బేసిన్‌లో జూరాల సోర్స్‌గా ప్రాజెక్ట్ నిర్మించకపోవడం గత ప్రభుత్వం చేసిన ఘోర తప్పిదమని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
వరద ప్రవాహాలను బట్టి సాగునీటి సరఫరాపై నిర్ణయం
ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా తాగు నీటి అవసరాలు తీరాకే సాగు నీరు విడుదల చేస్తామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. నీరు తక్కువగా ఉన్న కొన్ని ప్రాజెక్టుల నుంచి విడుదల వాయిదా వేశామన్నారు. పంట కీలక దశలో ఉన్నప్పుడు నీరు అందకపోతే రైతులకు నష్టం జరుగుతుందని చెప్పారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో 48.55 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు ముందుగానే తెలియజేశామన్నారు. ‘ప్రాజెక్టులో నీటి నిల్వ పరిస్థితులను స్కివమ్ కమిటీ పరిశీలిస్తోంది. ఒక్కో రిజర్వాయర్‌లో ఒక్కో తీరుగా నీటి నిల్వలు ఉన్నాయి. రిజర్వాయర్లలో నీటి నిల్వను ప్రతి మంగళవారం రైతులకు తెలియజేస్తున్నాం. భవిష్యత్‌లో పడే వర్షాలు, వరద నీటి ప్రవాహాలను బట్టి సాగునీటి సరఫరాపై నిర్ణయం తీసుకుంటాం’ అని మంత్రి ప్రకటించారు. ఎల్ నినో పరిస్థితుల దృష్ట్యా యాసంగి సాగుకు ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, రైతులు పంటలు వేసే ముందు నీటి నిల్వల గురించి తెలుసుకోవాలని సూచించారు.
