
- బీసీ గురుకుల అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ రివ్యూ
హైదరాబాద్, వెలుగు: మహాత్మా జ్యోతిరావు ఫూలే వ్యవసాయ డిగ్రీ కాలేజీ విద్యార్థులకు మరింత నాణ్యవంతమైన టెక్నికల్ విద్య అందించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీతో గురుకుల సొసైటీ ఒప్పందం కుదుర్చుకునేందుకు సన్నాహాలు చేస్తోంది. త్వరలో ఈ అంశంపై యూనివర్సిటీ అధికారులతో ఒప్పందం ఖరారు కానుంది. మంగళవారం సెక్రటేరియెట్‌లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ఇన్ చార్జి సెక్రటరీ జ్యోతి బుద్దా ప్రకాశ్, వ్యవసాయ శాఖ సెక్రటరీ రఘునందన్, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జానయ్య, బీసీ గురుకుల సెక్రటరీ సైదులు, సుచిత్ర తదితరులు పాల్గొని ఒప్పందంపై చర్చించారు.
ప్రస్తుతం బీసీ గురుకుల పరిధిలో ఉన్న కరీంనగర్, వనపర్తిలోని వ్యవసాయ డిగ్రీ కాలేజీల్లో 1600 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఏటా ఈ సీట్లకు ఫుల్ డిమాండ్ ఉన్నప్పటికీ, ఫ్యాకల్టీ, ల్యాబ్‌ల వంటి మౌలిక సదుపాయాల కొరత సొసైటీకి సవాలుగా మారింది. దీన్ని అధిగమించేందుకు, ద్వితీయ, తృతీయ, చివరి సంవత్సరం విద్యార్థులకు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ అధ్యాపకుల సమక్షంలో బోధన అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ ఏడాది కరీంనగర్, వనపర్తిలోని వ్యవసాయ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్ ప్రక్రియ కొనసాగనుంది. విద్యార్థులకు ఫీల్డ్ విజిట్‌లు, ల్యాబ్‌లు, మౌలిక సదుపాయాలను రాజేంద్రనగర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, దాని అనుబంధ కాలేజీల్లో అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో ఈ ఒప్పందం ఖరారు కానుందని అధికారులు తెలిపారు.