
- పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేల సూచనలతో అభ్యర్థుల ఎంపిక
- గరం గరంగా సాగిన మీటింగ్
- పలు జిల్లాల అధ్యక్షుల తీరుపై నేతల ఆగ్రహం
- ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయ
- లోపం ఉందని ఆవేదన
- లోకల్ బాడీ ఎన్నికలపై
- 8న పార్టీ విస్తృతస్థాయి సమావేశం
హైదరాబాద్, వెలుగు: త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమన్వయం కోసం జిల్లాల వారీగా ఇన్చార్జులను నియమించాలని బీజేపీ నిర్ణయించింది. సీనియర్ లీడర్లకు ఆ బాధ్యతలు అప్పగించాలని డిసైడ్ అయింది. ఆదివారం (అక్టోబర్ 05) బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు నేతృత్వంలో పదాధికారుల సమావేశం జరిగింది. దీనిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, కర్నాటక– తమిళనాడు రాష్ట్రాల సహా ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లిహిల్స్ బై ఎలెక్షన్స్ తదితర అంశాలపై చర్చించారు. ప్రతి జిల్లాకు ఆ జిల్లా అధ్యక్షుడితోపాటు ఆ జిల్లా ఇన్చార్జ్, అబ్జర్వర్‌తో త్రిసభ్య కమిటీని కూడా ఏర్పాటు చేయాలని సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం పలు జిల్లాలకు ఇన్చార్జులుగా ఉన్న కొందరు పనిచేయడం లేదని, వారి స్థానంలో వెంటనే కొత్త వారిని నియమించాలని డిసైడ్ అయ్యారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల సూచనలను తీసుకొని అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించారు.
టీమ్ బీజేపీగా పనిచేద్దాం: రాంచందర్‌రావు
లోకల్ బాడీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను గెలిస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇది సంస్థాగత పునాది అవుతుందని బీజేపీ నేతలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సూచించారు. గత బీఆర్ఎస్ సర్కారు గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదని, ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు కూడా నిర్లక్ష్యం చేస్తున్నదని.. ఈ అంశాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాలని నేతలకు సూచించారు. పాత, కొత్త నేతలనే భేదం లేకుండా పనిచేసే వారందరికీ సమాన ప్రాధాన్యం ఇచ్చి టీమ్ బీజేపీగా పనిచేద్దామని ఆయన సూచించారు.
గరం గరంగా మీటింగ్
బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం గరం గరంగా సాగింది. స్థానికంగా పార్టీలోని సమస్యలను పట్టించుకోకుండా ఎన్నికలపై చర్చించడం ఏమిటని పలువురు నేతలు ప్రశ్నించారు. జిల్లాల్లో సమన్వయం లేకుండా ఎలా గెలుస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుల పనితీరుపై ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నిసార్లు అధిష్టానానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు.
దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు జోక్యం చేసుకొని.. అన్నింటినీ సరిచేసుకొని సమిష్టిగా ముందుకు వెళ్దామని తెలిపారు. మరోపక్క కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య సమన్వయలోపం ఉందని.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి కూర్చోలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని.. అధిష్టానం దీనిపై ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించినట్టు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలు ఏవీ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. లోకల్ బాడీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో, ఇన్చార్జుల నియామకంలో సరైన నేతలనే నియమించాలని ఎంపీ డీకే అరుణ సూచించారు.
8న విస్తృత స్థాయి సమావేశం
లోకల్ బాడీ ఎన్నికలపై ఈ నెల 8న రాష్ట్రస్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు తెలిపారు. పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. జిల్లాల వారీగా కమిటీలను ఏర్పాటు చేసుకొని, స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని పదాధికారుల సమావేశంలో నిర్ణయించినట్టు చెప్పారు. జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో గెలుపు కోసం నగరంలోని లీడర్లు, కేడర్ పనిచేయాలన్నారు.