లిక్కర్ నోటిఫికేషన్లు కాదు.. జాబ్ నోటిఫికేషన్లు ఇయ్యాలె

లిక్కర్ నోటిఫికేషన్లు కాదు.. జాబ్ నోటిఫికేషన్లు ఇయ్యాలె
  • ఖాళీల భర్తీ కోసం బీజేపీ నిరసనలు
  • పోలీసలు అడ్డుకోవడంతో ఉద్రిక్తతలు

హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ టీఎస్‌పీఎస్సీ ముందు ధర్నాకు పిలుపు ఇచ్చింది బీజేపీ యువజన విభాగం బీజేవైఎం. మరోవైపు మద్యం టెండర్లపై ఎక్సైజ్ ఆఫీస్ ను ముట్టడిస్తామని మహిళా మోర్చా ప్రకటించింది. ఈ రెండు కార్యక్రమాలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. బీజేపీ ఆఫీసు దగ్గర భారీగా సిబ్బందిని మోహరించారు. ధర్నా స్టార్ట్ కాకముందే అరెస్ట్ చేయడంతో అబిడ్స్ ఏసీపీ వెంకట్ రెడ్డి తో గొడవకు దిగారు బీజేవైఎం నేతలు. శాంతియుతంగా నిరసన తెలపుతామంటే అడ్డుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. ధర్నా చౌక్‌లో టీఆర్‌‌ఎస్‌ నేతల ధర్నాకు దగ్గరుండి భద్రత కల్పిస్తున్న పోలీసులు.. తమను అరెస్టులు చేయడం సరికాదని అన్నారు. 

బీజేపీ ఆఫీసుకు వచ్చే రోడ్డు మార్గాన్ని క్లోజ్ చేసి, నేతలు, కార్యకర్తలు అటు వైపు రాకుండా అడ్డుకుంటున్నారు పోలీసులు. ఎక్సైజ్ ఆఫీస్, టీఎస్‌పీఎస్సీ ముందు భద్రత పెంచారు. బీజేవైఎం, మహిళా మోర్చా నేతల ఆందోళనలకు అనుమతి లేదని తెలిపారు. అయితే ఇందిరా పార్క్ దగ్గర టీఆర్ఎస్ చేసే ధర్నాకు దగ్గరుండి బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు.. తమకు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు. 
ఇవ్వాల్సింది ఉద్యోగ నోటిఫికేషన్లని, లిక్కర్ పాలసీ నోటిఫికేషన్లు కాదంటూ మహిళా మోర్చా, బీజేవైఎం నేతలు నినాదాలు చేశారు. ఎక్సైజ్‌ ఆఫీసు మెయిన్‌ గేటు తోసుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేయగా.. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. పీఆర్సీ కమిషన్ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా రెండు లక్షల ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.