
- అభ్యర్థులు వీళ్లేనంటూ వైరల్‌గా మారిన జాబితా
- అందులో 98 శాతం మంది సిట్టింగులే
- తమ పరిస్థితి ఏంటని మిగతా వాళ్లలో ఆందోళన
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఫస్ట్ లిస్ట్ ఇదేనంటూ ఓ జాబితా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు బీఆర్ఎస్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ సోషల్‌మీడియాలో మాత్రం ‘కారు పార్టీ క్యాండిడేట్లు’ వీళ్లేనంటూ జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఆ లిస్టులో 98 శాతం మంది సిట్టింగ్ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇద్దరు ఎమ్మెల్యేల స్థానంలో ఇంకో ఇద్దరు ఎమ్మెల్సీల పేర్లు ఉన్నాయి. చాలా నియోజకవర్గాల్లో పోటీ కోసం ఏండ్లకేండ్లుగా కొందరు నేతలు ప్రయత్నిస్తున్నారు. వీరిలో ఇతర పార్టీల నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లు, పోటీ చేసి ఓడిపోయినవాళ్లు సైతం ఉన్నారు. వారందరికీ వచ్చే ఎన్నికల్లో చాన్స్ ఇస్తామని, లేదంటే రాజకీయంగా ప్రాధాన్యం ఇస్తామని చేరికల టైమ్‌లో కేసీఆర్, కేటీఆర్ హామీ ఇచ్చారు. పార్టీ ముఖ్య నేతలు హామీ ఇచ్చిన లీడర్ల పేర్లేవి సోషల్ మీడియాలో సర్క్యులేట్అవుతున్న లిస్టులో లేవు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెన్నంటి నడిచిన లీడర్ల పేర్లు కూడా అందులో లేవు.
కాంగ్రెస్ నుంచి వచ్చినోళ్లలో ఇద్దరికే చాన్స్..
బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టును కేసీఆర్ సోమవారం తెలంగా ణ భవన్లో ప్రకటిస్తారని, ఇందుకు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ముహూర్తంగా నిర్ణయించారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఒకేసారి 90 మందికి పైగా అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నాయి. సిట్టింగ్ఎమ్మెల్యేల్లో 9 నుంచి 12 మందిని మాత్రమే తప్పిస్తారని, వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తారని ప్రగతి భవన్ నుంచే లీకు లు ఇస్తున్నారు. కొత్తగా నర్సాపూర్ నుంచి మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి, కరీంనగర్‌నుంచి కాంగ్రెస్‌లో చేరిన చల్మెడ లక్ష్మీనర్సింహారావుకు వేములవాడ టికెట్ఇవ్వొచ్చని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్‌ను వీడి కారెక్కిన వాళ్లలో వీళ్లిద్దరికే టికెట్ఇవ్వనున్నట్టు సమాచారం. టికెట్ ఇస్తామనే హామీతోనే ఆరేపల్లి మోహన్(మానకొండూరు), ప్రతాప్‌రెడ్డి (షాద్ నగర్), భిక్షమయ్య గౌడ్(ఆలేరు)ను పార్టీలో చేర్చుకున్నారు. మాజీ మంత్రులు మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్స్వామిగౌడ్ సహా మరికొందరు లీడర్లకు రాజకీయంగా ఇతర అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ వీరి పేర్లు బీఆర్ఎస్ లీకులు ఇస్తున్న జాబితాలో లేవు. నెల కింద మెదక్ జిల్లాకు చెందిన ఇద్దరు లీడర్లు జహీరాబాద్ టికెట్ఆశిస్తూ గులాబీ కండువా కప్పుకున్నారు. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ఖాయమని ప్రచారం సాగింది. కానీ ఇప్పుడు ఆ ఇద్దరికీ టికెట్ దక్కదని ప్రచారం సాగుతోంది. ఇటీవల కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన భువనగిరికి చెందిన కాంగ్రెస్ నేత కుంభం అనిల్‌కుమార్ రెడ్డికి మాత్రం అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏదో ఒక పదవి ఇస్తారని చెబుతున్నారు.
ప్రగతి భవన్‌కు బీఆర్ఎస్ లీడర్ల క్యూ
సీఎం కేసీఆర్ అధికారిక నివాసం ప్రగతి భవన్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, లీడర్లు క్యూ కట్టారు. వచ్చే సోమవారం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుండడంతో తమ పరిస్థితి ఏమిటా.. అని ఆరా తీసేందుకు శుక్రవారం పెద్దఎత్తున తరలివచ్చారు. ఆసిఫాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ కోవ లక్ష్మీ మంత్రి హరీశ్‌రావుతో వచ్చి కేసీఆర్‌ను కలిశారు. మంచిర్యాల ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్‌రావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఉమ్మడి మెదక్‌జిల్లాకు చెందిన నాయకులు కూడా ప్రగతి భవన్‌కు వచ్చారు.