ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పిలుపులో భాగంగా ఆదివారం ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో నల్ల జెండాలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇల్లెందు క్రాస్ రోడ్డు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేస్తున్న క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య జరిగిన పెనుగులాటలో వన్‌టౌన్ సీఐ కరుణాకర్ మణికట్టు విరిగి తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోవడంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.
ఈ సందర్భంగా పువ్వాడ అజయ్ మాట్లాడుతూ తెలంగాణ సాధించిన నేతపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని, ఇలాంటి అక్రమ నోటీసులకు భయపడేది లేదని ధ్వజమెత్తారు. జిల్లాలోని వైరా, కారేపల్లి, మధిర, సిరిపురం, కొత్తగూడెం, కొణిజర్ల, టేకులపల్లి, కొత్తగూడెం లాంటి ప్రాంతాల్లో కూడా పార్టీ శ్రేణులు రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేసీఆర్ పై పెట్టిన తప్పుడు కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని బీఆర్ఎస్ నాయకులు హెచ్చరించారు. - వెలుగు, నెట్వర్క్
