- నిందితుల్లో ఆర్ఎస్ఐ, కానిస్టేబుల్
- రూ.17 లక్షలు, 3 కార్లు , చిల్డ్రన్ కరెన్సీ...
- స్వాధీనం చేసుకున్న సత్తుపల్లి పోలీసులు
సత్తుపల్లి, వెలుగు : 'ఇన్ కం ట్యాక్స్ సమస్య ఉంది, బ్లాక్ మనీని వైట్ గా మార్చాలని అనుకుంటున్నాం, ఇందుకు రూ. 10 లక్షలు ఇస్తే.. మేము రూ. 40 లక్షలు ఇస్తాం' అంటూ మోసం చేస్తున్న ముఠాను ఖమ్మం జిల్లా సత్తుపల్లి పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ గురువారం సత్తుపల్లిలో వెల్లడించారు.
ఏపీలోని ఏలూరు జిల్లా కలిదిండికి ఈద చంటి బాబు, టి.నర్సాపురానికి చెందిన మువ్వా సత్యనారాయణ, చింతలపూడి మండలం మల్లాయిగూడెంకి చెందిన మారుముడి మధు, కోనసీమ జిల్లా రావులపల్లి మండలం కొడగట్టుపల్లికి చెందిన సాగి సుబ్బరాజు, కర్నూలు జిల్లా శ్రీకృష్ణానగర్ కు చెందిన దుడుగురు కురుబ గణేశ్, సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం రాజేంద్రనగర్ కు చెందిన ఉపేంద్రం జనార్ధనరాజు, తెలంగాణలోని సత్తుపల్లి మండలం తుంబూరుకి చెందిన కానిస్టేబుల్ ముళ్లగిరి వర్ధన్, గంగారానికి చెందిన ఆర్ ఎస్ ఐ బేరా కేశవరావు, వేంసూరు మండలం బీరపల్లికి చెందిన గోరంట్ల గౌతమ్ కుమార్, నేలకొండపల్లి మండలం సదాశివపురం గ్రామానికి చెందిన కర్లపూడి నవీన్, తుంబూరుకి చెందిన నక్కా నాగరాజు, సికింద్రాబాద్ ఏఎస్ రావు నగర్ కు చెందిన కాపా శ్రీనివాస్ తో పాటు రామాంజనేయులు, రాజు ముఠాగా ఏర్పడ్డారు.
ఈజీగా డబ్బు సంపాదించాలన్న ఉద్దేశంతో పలువురిని మోసం చేసేందుకు నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈద చంటిబాబు సిమ్ కార్డులను కొని వాటి నుంచి పలు నంబర్లకు ఫోన్ చేసేవాడు. తాను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నానని, తన అకౌంట్ లో రూ.2 కోట్లు ఉన్నాయని, ఇన్ కం ట్యాక్స్ సమస్య కారణంగా దానిని వైట్ గా మార్చాలని అనుకుంటున్నానని చెప్పేవాడు. ఇందుకు తనకు రూ. 10 లక్షల క్యాష్ ఇస్తే.. బదులుగా రూ. 40 లక్షలు అకౌంట్ లో వేస్తానని చెప్పేవాడు. తాను చెప్పిన చోటుకు డబ్బులు తీసుకొని వస్తే.. తన మనిషిని పంపిస్తానని, అతడికి డబ్బులు చూపించి అకౌంట్ నంబర్ ఇస్తే అందులో రూ. 40 లక్షలు డిపాజిట్ చేస్తానని చెప్పేవాడు. ఈ డబ్బుల్లో తనకు ఇచ్చిన రూ. 10 లక్షలతో పాటు మరో రూ. 12 లక్షలు తీసుకొని మిగతా... రూ. 18 లక్షలు క్యాష్ గా ఇస్తే సరిపోతుందని నమ్మించేవాడు.
చిల్డ్రన్స్ కరెన్సీ నోట్లు, డమ్మీ పోలీసులతో...
అతడి మాటలు నమ్మి ఎవరైనా డబ్బులు ఇచ్చేందుకు ఆసక్తి చూపితే.. వారిని తాను చెప్పిన చోటుకి రప్పించేవాడు. అక్కడకు పిల్లలు ఆడుకునే కరెన్సీ నోట్ల బ్యాగ్ ను ఇచ్చి తన మనిషిని పంపించేవాడు. అక్కడికి వెళ్లాక సదరు వ్యక్తి ఇచ్చి ఓరిజినల్ నోట్లను లెక్కబెట్టే సమయంలో.. ముఠాకు సహకారం అందిస్తున్న ఆర్ఎస్ఐ కేశవరావుతో పాటు కానిస్టేబుల్ ముళ్లగిరి వర్ధన్ యూనిఫామ్ లో వచ్చి.. దొంగనోట్ల వ్యాపారం చేస్తున్నారని, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అంటూ ఇరువైపుల వారిని బెదిరించి డబ్బులను లాక్కొని అక్కడి నుంచి పరార్ అయ్యేవారు.
కడప జిల్లా పొద్దుటూరుకు చెందిన కుర్రా గంగాధర్ రెడ్డి గత నెల 25న సత్తుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎంక్వైరీ ప్రారంభించారు. ఇందులో భాగంగా సత్తుపల్లి మండల పరిధిలోని గంగారం గ్రామ సమీపంలో డీల్ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దాడి చేశారు. మొత్తం 12 మందిని పట్టుకోగా రామాంజనేయులు, రాజు పరారీలో ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 17.60 లక్షలు, రెండు ఇన్నోవా, ఒక ఎర్టిగా కారు, స్కూటీ, 16 సెల్ ఫోన్లు, పోలీస్ యూనిఫాం, సంకెళ్లు, చిల్డ్రన్స్ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ శ్రీహరి, ఎస్సైలు ప్రదీప్ కుమార్, వీరప్రసాద్ పాల్గొన్నారు.
