
- స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీకి బీఆర్ఎస్ విజ్ఞప్తి
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తయారీ, ప్రింటింగ్, తుది ప్రక్రియకు కేటాయించిన సమయం చాలా తక్కువగా ఉందని బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మాజీ ఎంపీ వినోద్ కుమార్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, ఎల్. రమణ, పార్టీ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కలిశారు. రాష్ట్రంలో ప్రస్తుతం భారీ వర్షాలు, వరదల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఇలాంటి సమయంలో సిబ్బంది సమీకరణ లాంటివి అసాధ్యమవుతాయని పేర్కొన్నారు.
ప్రతి దశ మధ్య కనీసం ఒక వారం విరామం ఉండేలా ఎన్నికల షెడ్యూల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి చేశారు. 2025 జులై 1 తర్వాత ఓటర్లుగా నమోదు చేసుకున్న కొత్త ఓటర్లను జాబితా నుంచి అన్యాయంగా తొలగించడం మంచిది కాదన్నారు. ఈ అంశాలను ఎన్నికల సంఘంతో పాటు రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ (సీఈవో) సుదర్శన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లారు.