తెలంగాణలో ధాన్యం రవాణాకు  రైల్వే రేక్స్ కొరత లేదు

తెలంగాణలో ధాన్యం రవాణాకు  రైల్వే రేక్స్ కొరత లేదు
  • ఎంపీ కడియం కావ్య ప్రశ్నకు కేంద్ర రైల్వే శాఖ సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు అవసరమైన రైల్వే రేక్స్‌‌‌‌‌‌‌‌ను సమృద్ధిగా కేటాయిస్తామని కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ (ఎఫ్‌‌‌‌సీఐ) అందించే రిపోర్టుల ఆధారంగానే రైల్వే బోగీల కేటాయింపు జరుగుతుందని కేంద్రం వివరించింది. గతేడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో జరిగిన శీతాకాల సమావేశాల్లో భాగంగా తెలంగాణలో ధాన్యం, పత్తి రవాణాకు సంబంధించి రైతుల సమస్యలను ఎంపీ కడియం కావ్య రూల్ 377 కింద కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ నేపథ్యంలో కేంద్ర రైల్వే శాఖ సహాయమంత్రి రవనీత్ సింగ్ తాజాగా లేఖ ద్వారా సమాధానమిచ్చారు. 2026 జనవరి నాటికి తెలంగాణ నుంచి ఎఫ్‌‌‌‌సీఐ ద్వారా సుమారు 3.59 మిలియన్ టన్నుల ధాన్యం లోడింగ్ పూర్తయిందని, దీని కోసం1,329 రైల్వే రేక్స్‌‌‌‌ను వినియోగించినట్టు మంత్రి వెల్లడించారు. రైల్వే మార్గాల సామర్థ్యం, బోగీల లభ్యతను పరిగణనలోకి తీసుకుంటూనే, వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు.