ముదిరాజ్లకు త్వరలో తీపి కబురు

ముదిరాజ్లకు త్వరలో తీపి కబురు
  • ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్

పంజాగుట్ట, వెలుగు: ముదిరాజ్ సామాజిక వర్గం పట్ల, ఆత్మగౌరవ భవన నిర్మాణాల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా ఉన్నారని రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తెలిపారు. గురువారం హైదరాబాద్ ప్రెస్ క్లబ్​లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో ట్రస్ట్ పేరుతో ఆత్మగౌరవ భవనాలు, స్థలాలను దుర్వినియోగం చేసిన వారిపై త్వరలోనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ముదిరాజ్ ఆత్మగౌరవాన్ని కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టి మోసం చేశారని ఆరోపించారు. కోకాపేటలో కేటాయించిన ఐదు ఎకరాల స్థలంలో భవన నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్​తో చర్చించి రూ. 5 కోట్ల మంజూరుకు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. ముదిరాజ్ కులాన్ని బీసీ–డీ నుంచి బీసీ–-ఏ లోకి మార్చే అంశంపై త్వరలోనే సీఎం రేవంత్​రెడ్డి నుంచి తీపి కబురు అందుతుందన్నారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ డీసీసీ ప్రెసిడెంట్ రోహిత్ ముదిరాజ్, చొప్పరి శంకర్, సామల హేమ తదితరులు పాల్గొన్నారు.