రెండు రోజుల పసికందు.. ప్రసవం తర్వాత తన బిడ్డను ఇంటికి తీసుకెళ్లాలని ఎదురుచూస్తున్న తల్లి.. కానీ ఆస్పత్రి మాత్రం ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యిందనే కారణంతో చిన్నారిని తల్లికి అప్పగించకుండా గంటల తరబడి దూరంగా ఉంచింది. ఈ ఘటనపై మహారాష్ట్ర రాష్ట్ర వినియోగదారుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ముంబైలోని భాటియా ఆస్పత్రి వ్యవహారాన్ని తప్పుబడుతూ బాధిత కుటుంబానికి రూ.37 వేల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఆస్పత్రి సిబ్బంది వ్యవహారం నిర్లక్ష్యంగా, మానవత్వం లేనిదిగా, బాధ్యతారాహిత్యంగా ఉందని కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
అసలు ఏం జరిగింది?
2017 ఫిబ్రవరిలో జన్మించిన 2 రోజుల పసికందు ఆరోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రి NICUలో చికిత్స పొందుతోంది. ఫిబ్రవరి 23 సాయంత్రానికే వైద్యుడు చిన్నారిని మరుసటి రోజు డిశ్చార్జ్ చేయవచ్చని సూచించాడు. దీంతో ఫిబ్రవరి 24 ఉదయం 6.30 గంటలకు చిన్నారి తండ్రి డిశ్చార్జ్ ప్రక్రియ ప్రారంభించాలని ఆస్పత్రికి తెలియజేశాడు. అయితే ఉదయం 10 గంటలైనా ఎలాంటి స్పందన లేదు ఆసుపత్రి నుంచి. ఇదే సమయంలో క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయ్యింది. వెంటనే చిన్నారి తండ్రి ఆస్పత్రికి రూ.15 వేల డిపాజిట్ చెల్లించాడు. ఇది మొత్తం బిల్లు కంటే ఎక్కువ మొత్తమే అయినప్పటికీ.. డిశ్చార్జ్ స్లిప్ సిద్ధమైన తర్వాత కూడా ఆస్పత్రి చిన్నారిని విడుదల చేయలేదు. దీంతో పసికందు తన తల్లికి 9 గంటలకుపైగా దూరంగా ఉండాల్సి వచ్చింది.
కోర్టు ఏమంది?
ఈ కేసును విచారించిన మహారాష్ట్ర రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆస్పత్రి వాదనలను తిరస్కరించింది. బిల్లు కంటే ఎక్కువ డబ్బు చెల్లించిన తర్వాత కూడా చిన్నారిని తల్లికి దూరంగా ఉంచేందుకు ఎలాంటి హక్కు లేదని స్పష్టం చేసింది. ఆస్పత్రి నిబంధనల ప్రకారమే క్యాష్‌లెస్ క్లెయిమ్ తిరస్కరించబడితే పూర్తి బిల్లు డిపాజిట్ చేసి డిశ్చార్జ్ తీసుకెళ్లవచ్చని రికార్డుల్లో ఉందని గుర్తుచేసింది. చిన్నారి తండ్రి అదే విధంగా వ్యవహరించినప్పటికీ.. ఆస్పత్రి సిబ్బంది స్పందించిన తీరు పూర్తిగా తప్పని కమిషన్ పేర్కొంది.
ఈ ఘటనలో బాధపడింది కేవలం కుటుంబమే కాదు.. అప్పుడే పుట్టిన పసికందు, తన బిడ్డ కోసం ఎదురు చూసిన తల్లి కూడా తీవ్ర మానసిక వేదన అనుభవించాల్సి వచ్చిందని కమిషన్ పేర్కొంది. డిశ్చార్జ్‌కు వైద్యుడు అనుమతి ఇచ్చిన తర్వాత కూడా సిబ్బంది ఆలస్యం చేయడం ఏమాత్రం సమంజసం కాదని స్పష్టం చేసింది. డబ్బు వసూలు చేయడంపై దృష్టి పెట్టే బదులు.. ముందుగా మానవత్వంతో వ్యవహరించి వెంటనే చిన్నారిని తల్లికి అప్పగించాల్సిందని వ్యాఖ్యానించింది.
ఈ వ్యవహారంలో గతంలో జిల్లా కమిషన్ ఇచ్చిన తీర్పును రద్దు చేసిన రాష్ట్ర కమిషన్, భాటియా ఆస్పత్రికి బాధిత కుటుంబానికి రూ.2వేలు అదనంగా వసూలు చేసిన బిల్లును తిరిగి చెల్లించాలని, అలాగే రూ.25వేలు నష్టపరిహారం, రూ.10వేలు కోర్టు ఖర్చుల కోసం చెల్లించాలని ఆదేశించింది. మొత్తం రూ.37వేలతో పాటు వడ్డీ కూడా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో బిల్లుల కంటే రోగుల హక్కులు, మానవత్వం ముఖ్యమని న్యాయస్థానం స్పష్టమైన సందేశం ఇచ్చింది.
