ఉమ్మడి జిల్లాల జీజీహెచ్‌‌ల్లో ఎంఆర్ఐ సేవలు..ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం

ఉమ్మడి జిల్లాల జీజీహెచ్‌‌ల్లో ఎంఆర్ఐ సేవలు..ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయం
  • ప్రస్తుతం ఉస్మానియా, గాంధీ, నిమ్స్ లోనే వసతులు
  •     జిల్లాల్లో అందుబాటులో లేక ప్రైవేట్ సెంటర్లను ఆశ్రయించి నష్టపోతున్న పేదలు
  •     ఇకపై సొంత జిల్లాలోనే ఉచితంగా వైద్య నిర్ధారణ సేవలు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రజలకు సూపర్ స్పెషాలిటీ  వైద్య నిర్ధారణ సేవలను చేరువ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు కేవలం హైదరాబాద్‌‌ లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్, ఎంఎన్‌‌జే క్యాన్సర్ హాస్పిటల్ వంటి కొన్ని పెద్ద హాస్పిటల్స్ కే పరిమితమైన ఎమ్మారై స్కాన్ సేవలను ఉమ్మడి జిల్లాల్లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్స్ (జీజీహెచ్)లలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. ప్రతి ఉమ్మడి జిల్లా కేంద్రంలో ఎమ్మారై, సీటీ స్కాన్ మెషిన్ల ఏర్పాటుతో పాటు రేడియాలజిస్టులు, టెక్నీషియన్లను అందుబాటులో ఉంచేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు స్పీడప్ చేసింది. జిల్లాల్లో ఈ సేవలు అందుబాటులోకి వస్తే.. జిల్లాల నుంచి హైదరాబాద్ కు ప్రయాణించే భారం తప్పనుంది. స్థానిక జీజీహెచ్ డాక్టర్లు వెంటనే స్కాన్ రిపోర్టులను పరిశీలించి చికిత్స ప్రారంభించడానికి వీలవుతుంది. మరోవైపు హైదరాబాద్‌‌లోని హాస్పిటల్స్ పై రద్దీ కూడా తగ్గనుంది.

ప్రైవేట్ లో వేలు ఖర్చు చేస్తూ... 

ప్రస్తుతం జిల్లాల్లోని టీచింగ్ హాస్పిటల్స్ లో ఎమ్మారై సౌకర్యం లేకపోవడంతో ఆయా ప్రాంతాల డాక్టర్లు, పేషెంట్లను హైదరాబాద్‌‌ లోని హాస్పిటల్స్ కు రెఫర్ చేస్తున్నారు. దీనివల్ల సిటీ హాస్పిటల్స్ కు పేషెంట్లు పోటెత్తుతున్నారు. అక్కడ ఎమ్మారై స్కాన్ కావాలంటే పేషంట్లు వారాల తరబడి వెయిటింగ్ లిస్టులో వేచి చూడాల్సి పరిస్థితి ఉన్నది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్న పేషెంట్లకు కూడా సకాలంలో రిపోర్టులు రాక వైద్యంలో ఆలస్యమవుతున్నది. వెయిటింగ్ టైమ్ ఎక్కువగా ఉంటుండటంతో  ప్రైవేట్ హాస్పిటల్స్ ను ఆశ్రయిస్తున్నారు. ప్రైవేటులో ఒక్కో ఎమ్మారై స్కాన్‌‌ కు వేలల్లో వసూలు చేస్తున్నారు. ఎమర్జెన్సీ టెస్టుల కోసం పేద కుటుంబాలు అప్పులు చేయాల్సి వస్తున్నది. ఉచిత సేవలు అందుబాటులో లేక ఆర్థిక ఇబ్బందులతో పరీక్షలు ఆలస్యమై రోగుల పరిస్థితి విషమించిన సందర్భాలూ కూడా ఉన్నాయి. 

ఉమ్మడి జిల్లాల్లోనే ఖరీదైన సేవలు

ఉమ్మడి జిల్లాల జీజీహెచ్‌‌లలో ఎమ్మారై సేవలు అందుబాటులోకి వస్తే  పేద ప్రజలకు సొంత జిల్లాలోనే ఎమ్మారై టెస్టులు ఫ్రీగా లభించనున్నాయి. బ్రెయిన్ ఎమ్మారై ద్వారా పక్షవాతం తీవ్రత, బ్రెయిన్ ట్యూమర్లు, ఫిట్స్, మెదడు ఇన్ఫెక్షన్లు, తలగాయాల తీవ్రతను స్థానికంగానే గుర్తించవచ్చు. అలాగే, స్పైన్ ఎమ్మారై ద్వారా నడుము, డిస్క్ బల్జ్ (స్లిప్ డిస్క్), నరం నలగడం, వెన్నుపాము గాయాల నిర్ధారణ జిల్లాల్లోనే జరుగుతుంది. మోకాళ్లు, భుజాలు, తుంటి కీళ్లలోని లిగమెంట్లు చిరగడం తదితర టెస్టులను జీజీహెచ్ లలోనే పొందుతారు. వీటితో పాటు ఎంఆర్ యాంజియోగ్రఫీ, గర్భాశయం, ప్రొస్టేట్ గ్రంథి సమస్యలు, క్యాన్సర్ కణాల వ్యాప్తి నిర్ధారణ వంటి ఖరీదైన స్కానింగ్ సేవలన్నీ నిరుపేద రోగులకు సొంత జిల్లాలోనే ఉచితంగా లభించనున్నాయి.