- నస్తూర్పల్లిలో సభ.. అక్కడే
- రైతు భరోసా నిధుల విడుదలరూ.200 కోట్లతో
- కాళేశ్వరం ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
- ఏర్పాట్లను పరిశీలించిన
- మంత్రులు తుమ్మల, శ్రీధర్ బాబు
జయశంకర్ భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు: కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం పరిశీలించనున్నారు. మేడిగడ్డ డ్యామ్ సైట్‌ను పరిశీలించడంతోపాటు ఆఫీసర్లతో రివ్యూ చేయనున్నారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్పల్లిలో రైతులతో నిర్వహించనున్న సభలో రైతు భరోసా రెండో విడత నిధులు విడుదల చేయనున్నారు.
ఈ నేపథ్యంలో సీఎం పర్యటనకు సంబంధించి ఆఫీసర్లు సర్వం సిద్ధం చేశారు. మేడిగడ్డ, నస్తూర్పల్లిలో హెలీ ప్యాడ్ నిర్మాణంతో పాటు బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సభ ప్రాంగణంలో ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు సోమవారం మధ్యాహ్నం ముందుగా హెలీకాప్టర్‌లో కాళేశ్వరం వెళ్తారు. అక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం రూ.200 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత అక్కడి నుంచి మేడిగడ్డ వెళ్లి బ్యారెజీ సైట్ ను పరిశీలించి ఎల్అండ్ టీ గెస్ట్ హౌస్‌లో ఆఫీసర్లతో సమీక్షించనున్నారు. అనంతరం కాటారం మండలంలోని నస్తూర్‌పల్లి లో రైతులతో నిర్వహించనున్న బహిరంగ సభకు హజరుకానున్నారు. అక్కడే సభలో రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేసి ప్రసంగించనున్నారు. ఈ బహిరంగ సభ కు సంబంధించిన ఏర్పాట్లను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదివారం పరిశీలించారు. సభకు భారీగా రైతులను తరలించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో సభకు వచ్చే రైతులు, మహిళలకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంచినీటి వసతి, పార్కింగ్ సదుపాయం, కరెంట్, తాత్కాలిక మరుగుదొడ్ల సదుపాయాల్లో ఎలాంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వర్ రావు మాట్లాడుతూ పదేళ్ల బీఆర్ఎస్ కాలంలో తెలంగాణ విధ్వంసానికి గురైందన్నారు. విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించేందుకు కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తుందన్నారు. రెండేళ్ల కాలంలో రైతులకు లక్షా పదివేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తదితరులు పాల్గొన్నారు.

