V6 News

నాణెమంటే చరిత్ర అవే మన మూలాలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

నాణెమంటే చరిత్ర అవే మన మూలాలు: డిప్యూటీ సీఎం  భట్టి విక్రమార్క
  • కాయిన్ చరిత్ర తెలిస్తే.. ఆ కాలం కథ తెలిసినట్టే  
  • వారసత్వ అధ్యయనాల్లో తెలంగాణ ముందుండాలని పిలుపు 


హైదరాబాద్, వెలుగు: నాణేమంటే కేవలం లోహం కాదని, అది చరిత్రకు సాక్ష్యమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ‘‘నాణేలు చూడటానికి చిన్నవే కావొచ్చు.. కానీ అవి చరిత్రను దాచుకున్న ‘కంప్రెస్డ్ డేటా’ లాంటివి. పురావస్తు శాస్త్రవేత్తలు ఇప్పుడు గనుక జిప్ ఫైల్ కనిపెట్టి ఉంటే.. దానికి కచ్చితంగా ‘కాయిన్’ అని పేరు పెట్టేవారేమో. నాణేల అధ్యయనం అంటే కేవలం లోహాన్ని చూడటం కాదు.. ఆ కాలం నాటి ఆలోచనలను అధ్యయనం చేయడమే” అని పేర్కొన్నారు. నాణేల అధ్యయనం (న్యూమిస్ మ్యాటిక్స్), వారసత్వ పరిశోధనల్లో తెలంగాణ ముందుండాలని పిలుపునిచ్చారు.

 గురువారం హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్డీలో ‘దక్షిణ భారతదేశ నాణేలు–ఆర్థిక వ్యవస్థ’ అనే అంశంపై న్యూమిస్ మ్యాటిక్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన నేషనల్ సెమినార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు భట్టి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. యువ పరిశోధకులు నాణేల చరిత్రపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. వారసత్వ సంపద రక్షణకు, శాస్త్రీయ అధ్యయనానికి తాము పెద్దపీట వేస్తున్నామని.. రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మార్చేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. 

దక్షిణాది పరంపర ఘనం.. 

దక్షిణ భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత సమృద్ధిగా నాణేల పరంపర ఉందని భట్టి అన్నారు. ‘‘శాతవాహనులు, ఇక్ష్వాకుల కాలం నాటి వాణిజ్య నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి కాకతీయులు, విజయనగర సామ్రాజ్య వైభవం వరకు మన నాణేలు ఆవిష్కరణకు, కళాత్మకతకు అద్దం పట్టాయి. తెలంగాణ ప్రాంతం వాణిజ్యానికి కేంద్ర బిందువుగా ఉండేదని చెప్పడానికి కోటి లింగాలలో దొరికిన శాతవాహనుల సీసపు నాణేమే సాక్ష్యం. రాజకీయ అధికారం, బౌద్ధం, వాణిజ్యం, లోహశాస్త్రం అన్నీ ఈ చిన్న నాణెంలో ఇమిడి ఉన్నాయి.

 పురావస్తు శాఖ చరిత్రలో కేవలం నాణేలపైనే జాతీయ సదస్సు నిర్వహించడం ఇదే తొలిసారి. ఇది చారిత్రక మైలురాయి. ఈ సదస్సు రెండు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం” అని అన్నారు. ఈ సందర్భంగా ‘చందా- ఎన్ ఎర్లీ హిస్టారిక్ సైట్ ఇన్ తెలంగాణ’, ‘సౌత్ ఇండియన్ ఫానమ్స్’ తదితర పుస్తకాలను భట్టి ఆవిష్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ హెరిటేజ్ డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ డైరెక్టర్ అర్జునరావు, న్యూమిస్ మ్యాటిక్స్ సొసైటీ చైర్మన్ డి.రాజారెడ్డి, జనరల్ సెక్రటరీలు ప్రొఫెసర్ పీఎన్ సింగ్, ప్రొఫెసర్ బింద దత్తాత్రేయ, డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

నాణెం.. ఓ చిన్న ప్రపంచం

న్యూమిస్ మ్యాటిక్స్ అంటే చేతిలో పట్టుకునే చిన్న లోహపు ముక్కల అధ్యయనం మాత్రమే కాదని భట్టి అన్నారు. ‘‘నాణెంలోకి తొంగి చూస్తే ఒక చిన్న ప్రపంచమే కనిపిస్తుంది. కొన్ని గ్రాముల లోహంలో ఆనాటి ఆర్థిక వ్యవస్థ, రాజుల ఆశయాలు, సాంకేతిక పరిజ్ఞానం, వాణిజ్య మార్గాలు, ధార్మిక చిహ్నాలు, దౌత్య సంబంధాలన్నీ నిక్షిప్తమై ఉంటాయి. 

ఈ నాణేలు మనతో మాట్లాడతాయి. ఆనాటి పన్నుల విధానం నుంచి రాజకీయ దృక్పథం వరకు ఎన్నో విషయాలను వివరిస్తాయి. డిజిటల్ పేమెంట్లు, క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో.. మన ఆర్థిక ప్రయాణం 18 పైసల నుంచి ఎంత దూరం వచ్చిందో ఈ నాణేలు గుర్తుచేస్తాయి” అని పేర్కొన్నారు.