
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి సవాల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కుల గణన సర్వే జరిగిన నెల రోజుల సమయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలో లేనందున, ఆయనకు దీనిపై అవగాహన లేదని, అందుకే విమర్శలు చేస్తున్నారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆరోపించారు. శుక్రవారం గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కుల గణనపై చర్చకు సిద్ధమా అని కిషన్ రెడ్డికి సవాల్ చేశారు.
దీనిపై అసెంబ్లీలో చర్చ జరిగిన సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు కూడా మద్దతు తెలిపారు కాబట్టి, సొంత పార్టీ ఎమ్మెల్యేలపైకూడా అనుమానం ఉందా.. అని కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. 50 ఏండ్లుగా బీసీల కోసం కొట్లాడిన ఆర్ కృష్ణయ్యకు లేని అనుమానాలు కిషన్ రెడ్డికి ఎందుకని ఫైర్ అయ్యారు. కృష్ణయ్య చేసే సూచనలను కూడా తమ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందని చెప్పారు. దేశంలో కుల, మతాలకు అతీతంగా పాలన సాగాలంటే రాహుల్ గాంధీ ప్రధాని కావాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశంలో ఇందిరమ్మ పాలన రాహుల్‌తోనే సాధ్యమని చెప్పారు.