ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి.. డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోండి..   డీజీపీని కలిసిన కాంగ్రెస్ నేతలు

తెలంగాణ డీజీపీ రవిగుప్తాను కాంగ్రెస్ నేతలు కలిశారు.. రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతోందని కామెంట్స్ చేసిన బీజేపీ,- బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.  డీజీపిని కలిసిన వారిలో.. పీసీసీ ప్రధాన కార్యదర్శులు కైలాశ్ నేత, చారుకొండ వెంకటేశ్, మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కూలుతుందంటూ కామెంట్స్ చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి,  బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్  కామెంట్స్ పై పూర్తి విచారణ జరిపి కేసులు పెట్టి, జైలుకు పంపాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.  

అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ...తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.  పేదల రక్తం తాగే పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రజల తీర్పును అగౌరవ పరుస్తున్నారని దుయ్యబట్టారు. దళిత సబ్ ప్లాన్ అమలు చేయకపోతే దొరల బూట్లు నాకిన కడియం ఇప్పుడు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  ప్రభుత్వాన్ని కూల్చివేసి అడ్డదారిలో ప్రభుత్వంలోకి రావాలని చూస్తే సమాజం చూస్తూ ఊరుకోదన్నారు.