Maatrubhumi: సల్మాన్ ఖాన్ 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' టైటిల్ మార్పు.. 'మాతృభూమి'గా ఎందుకు మార్చారంటే?

Maatrubhumi: సల్మాన్ ఖాన్ 'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' టైటిల్ మార్పు.. 'మాతృభూమి'గా ఎందుకు మార్చారంటే?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కొత్త సినిమా వస్తుందంటేనే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అది కూడా దేశభక్తి నేపథ్యమున్న యుద్ధ చిత్రం అంటే ఇక చెప్పక్కర్లేదు. గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్న సల్మాన్  చిత్రం ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ అకస్మాత్తుగా ‘మాతృభూమి – మే వార్ రెస్ట్ ఇన్ పీస్’ (Maatrubhumi – May War Rest In Peace) గా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సంతోష్ బాబు వీరగాధగా..
2020 జూన్ నెలలో లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత-చైనా సైనికుల మధ్య జరిగిన భీకర ఘర్షణ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ పోరాటంలో వీరమరణం పొందిన తెలంగాణ గడ్డపై పుట్టిన ధీరుడు, సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమళ్ళ సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపిస్తున్నట్లు సమాచారం. దేశం కోసం ప్రాణాలర్పించిన ఒక యోధుడి కథను వెండితెరపై ఆవిష్కరిస్తుండటంతో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాపై భారీ క్యూరియాసిటీ నెలకొంది.

చైనా అక్కసు.. టైటిల్ మార్పునకు కారణం?

ఈ సినిమా టీజర్ విడుదలైనప్పటి నుంచే వివాదాలు చుట్టుముట్టాయి. చైనా అధికారిక మీడియా 'గ్లోబల్ టైమ్స్' ఈ చిత్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించింది. భారత్ చరిత్రను వక్రీకరిస్తోందని, సినిమా తీసినంత మాత్రాన వాస్తవాలు మారిపోవంటూ చైనా అక్కసు వెళ్లగక్కింది. మరోవైపు, సున్నితమైన సరిహద్దు అంశం కావడంతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ సినిమాను విడుదలకు ముందే స్క్రీనింగ్ చేయాలని కోరినట్లు వార్తలు వచ్చాయి.

ALSO READ : ఆస్కార్స్ వేదికపై కోట, ధర్మేంద్రలకు ఘన నివాళి..

ఈ రాజకీయ , దౌత్యపరమైన ఒత్తిళ్ల నేపథ్యంలోనే, వివాదాలకు తావు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో మేకర్స్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే పేరును పక్కన పెట్టి, సెంటిమెంట్ కలగలిసిన ‘మాతృభూమి’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

 విడుదల ఎప్పుడంటే?

ప్రముఖ దర్శకుడు అపూర్వ లఖియా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, సల్మాన్ ఖాన్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో చిత్రాంగద సింగ్ కథానాయికగా నటిస్తుండగా, అభిలాష్ చౌదరి కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ,రెండు పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాయి. ఈ చిత్రాన్ని భారత స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 2026లో విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. తనదైన మేనరిజమ్స్‌తో సల్మాన్ ఖాన్ ఈ 'మాతృభూమి' కోసం ఎంతటి భారీ విజయాన్ని అందుకుంటారో చూడాలి!