Oscars 2026: ఆస్కార్స్ వేదికపై కోట, ధర్మేంద్రలకు ఘన నివాళి.. గర్వపడుతున్న భారతీయులు!

Oscars 2026: ఆస్కార్స్ వేదికపై కోట, ధర్మేంద్రలకు ఘన నివాళి.. గర్వపడుతున్న భారతీయులు!

ప్రపంచ సినీ రంగంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుల (Oscar Academy Awards) ప్రదానోత్సం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో హాలీవుడ్‌తో పాటు వివిధ దేశాల సినీ ప్రముఖులు పాల్గొని వేడుకను మరింత విశేషంగా తీర్చిదిద్దారు. అయితే, ఈ  ఆస్కార్ అవార్డుల వేడుకలో అద్భుతమైన ఘట్టం చోటుచేసుకుంది.

గత ఏడాది (2025)లో మరణించిన ప్రముఖ నటీనటులకు ఆస్కార్ అకాడమీ ‘ఇన్ మెమోరియం’ సెగ్మెంట్‌లో ఘన నివాళులు అర్పించింది. తమ అద్భుతమైన నటనతో కోట్లాది అభిమానులను సంపాదించిన కళాకారులను ఈ సందర్భంగా గుర్తుచేసుకుంది.

భారతీయ సినీ దిగ్గజాలకు గుర్తింపు

ఈ నివాళుల జాబితాలో హాలీవుడ్ ప్రముఖులతో పాటు భారతీయ సినిమా నుంచి కోట శ్రీనివాసరావు, ధర్మేంద్ర, మనోజ్ కుమార్, బి.సరోజాదేవి వంటి దిగ్గజాల పేర్లను అకాడమీ తన అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా పొందుపరిచింది. ఇది భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచింది.

కోట శ్రీనివాసరావు – గర్వించదగ్గ నటుడు 

టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన కోట శ్రీనివాసరావు సుమారు 40 ఏళ్లకు పైగా సినీ ప్రయాణంలో ఎన్నో గుర్తుండిపోయే పాత్రలు పోషించారు. ఆయన గత ఏడాది జూలై 13న కన్నుమూశారు. తన ప్రత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

ఈ ఏడాది ఆస్కార్ వేడుకల్లో భారతీయ కళాకారులకు లభించిన ఈ గౌరవం, వారి కృషికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుగా నిలిచింది. సినీ రంగానికి వారు అందించిన సేవలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆస్కార్ అకాడమీ ఈ నివాళుల ద్వారా మరోసారి గుర్తు చేసింది.

ధర్మేంద్ర – బాలీవుడ్ లెజెండ్

బాలీవుడ్‌లో లెజెండరీ నటుడిగా నిలిచిన ధర్మేంద్ర 89 ఏళ్ల వయసులో గతేడాది నవంబర్ 24న తుదిశ్వాస విడిచారు. ఆయన సినీ రంగానికి చేసిన విశేష సేవలకు గాను భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారంతో సత్కరించింది

కోట శ్రీనివాసరావు గురించి:

ప్రముఖ విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావు 83 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. 2025 జులై 13న  అనారోగ్యం, వయోభారం సమస్యలతో హైదరాబాదులో తుదిశ్వాస విడిచాడు.

కోట.. తెలుగు భాషలోనే కాకుండా తమిళం, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాల్లో కూడా నటించారు. 1978లో చిరంజీవి నటించిన ప్రాణం ఖరీదు సినిమాతో కోట తన అరంగేట్రం చేసాడు. 1985లో వచ్చిన విజయశాంతి ప్రతిఘటన మూవీతో మంచి గుర్తింపు పొందారు. ఆ సినిమాతో తన నట నైపుణ్యతని చాటుకుని వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్స్‌లో 750కి పైగా చిత్రాల్లో నటించారు. ఆయన బహుముఖ ప్రతిభకు గుర్తింపుగా ఎన్నో అవార్డులు అందుకున్నారు.

కోట శ్రీనివాసరావు అవార్డులు:

కోట శ్రీనివాసరావు ప్రతినాయకుడు, క్యారెక్టర్ యాక్టర్, సహాయ నటుడు వంటి వివిధ విభాగాల్లో తొమ్మిది రాష్ట్ర నంది అవార్డులు అందుకున్నాడు. అలాగే, కోట తన సినీ కెరీర్లో మరిన్ని గొప్ప అవార్డులు అందుకున్నారు. మొత్తం 9 నంది అవార్డులు గెలిచి సరికొత్త రికార్డ్ సృష్టించారు. అయితే ఏకంగా 9 అవార్డులు గెలుచుకొని అందరికంటే ఎక్కువ అవార్డులు గెలుచుకున్న నటుడిగా నిలిచారు.