కరోనాను లైట్ తీసుకుంటున్నరు .. జాగ్రత్తలు పాటించని జనం

కరోనాను లైట్ తీసుకుంటున్నరు .. జాగ్రత్తలు పాటించని  జనం

హైదరాబాద్,వెలుగు: గ్రేటర్ సిటీలో జనం కరోనా జాగ్రత్తలను సరిగా పాటిస్తలేరు. సెకండ్ వేవ్​తో గ్రేటర్​లో రోజురోజుకి పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.  ఓ పక్క వైరస్ వ్యాప్తి తీవ్రమవుతోందని అధికారులు చెప్తున్నప్పటికీ జనాల్లో మార్పు రావడం లేదు. ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా వాడాలని కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నా గ్రేటర్ జనం లైట్​గా తీసుకుంటున్నారు.  ఇప్పటికే గ్రేటర్ పరిధిలో కరోనా కేసులు 81 వేలు దాటాయి.  ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు గ్రేటర్ లో నమోదైన కేసులు 4 వేలకు దగ్గరలో ఉన్నాయి. గత 3  నెలలుగా కరోనా ప్రభావం పెద్దగా లేనప్పటికీ ఈ నెల మొదటి వారం నుంచి వైరస్​ తీవ్రత ఎక్కువైంది. సిటీలో రోజుకు వందకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు హాస్పిటల్స్ లో ట్రీట్​మెంట్ తీసుకుంటున్న వారిలో కోవిడ్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రాబోయే రోజుల్లో వైరస్ ప్రభావం పెరిగే చాన్స్  ఉన్నట్లు  డాక్టర్లు చెప్తున్నారు. అప్రమత్తంగా ఉంటేనే    కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని అంటున్నారు.
అన్​లాక్ తర్వాత రూల్స్ బ్రేక్  
మరోసారి లాక్ డౌన్​ ఉండదని అసెంబ్లీలో సీఎం కేసీఆర్​ ప్రకటించారు. దీంతో కరోనాను కట్టడికి,  తమను తాము కాపాడుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు​ తీసుకోవాలని డాక్టర్లు చెప్తున్నారు. లక్షణాలు లేకుండా కరోనా సోకిన వారు బయటతిరగకుండా ఐసోలేషన్​లో ఉండాలంటున్నారు. అన్ లాక్ తర్వాత కొన్నిరోజుల పాటు ఫిజికల్ డిస్టెన్స్ ను పాటించిన సిటీ జనం  తర్వాత దీనిగురించి పట్టించుకోలేదు. మెల్లమెల్లగా అన్నీ ఓపెన్ కావడంతో ఫిజికల్ డిస్టెన్స్​ను మరిచిపోయారు. ఆర్టీసీ బస్సులు ప్రారంభమైన తర్వాత మొదట్లో 
డిస్టెన్స్ పాటించేలా సీటింగ్ ఏర్పాటు చేశారు. బస్సు ఎక్కగానే కండక్టర్ ప్యాసింజర్లకు శానిటైజ్ ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం ఈ ముందస్తు 
జాగ్రత్తలనును కూడా ఆర్టీసీ పట్టించుకోవడం లేదు. షాపింగ్ మాల్స్, సినిమా థియేటర్లు, హోటల్స్, బార్లు, రెస్టారెంట్లు, జిమ్​లు,ఫిట్ నెస్ సెంటర్లు ఇలా అన్నింట్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.


లక్షణాలు లేని వారి నుంచే  ఎక్కువ వ్యాప్తి 
కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే సమావేశాలు, ఫంక్షన్లలో జనం ఎక్కువ లేకుండా చూడాలి.  పోలీసింగ్ సిస్టమ్ ద్వారా మాస్క్ లేని వారికి ఫైన్ విధించాలి. కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం మనం సెకండ్ వేవ్ లో ఉన్నాం.  క్లినియల్ ట్రయల్స్ అంచనా ప్రకారం తెలంగాణలో 2 కోట్ల మంది కరోనా బారిన పడ్డారు. లక్షణాలు లేకుండా కరోనా సోకిన వారు బయట తిరగడం వల్లే ఎక్కువ  వ్యాప్తి అవుతోంది. మాస్క్, ఫేస్ షీల్డ్, శానిటైజర్ తప్పనిసరిగా వాడాలి. రద్దీ ప్రాంతాల్లో  ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలి.   - డాక్టర్ విజయభాస్కర్, ఎథిక్స్ కమిటీ క్లినికల్ ట్రయల్స్ అండ్ రీసెర్చ్ చైర్మన్
బల్దియా హెడ్ ఆఫీసులో కొనసాగుతున్న ఆంక్షలు 
కరోనా కేసులు పెరుగుతుండటంతో బల్దియా హెడ్​ ఆఫీసులో ఆంక్షలు విధించారు.  ఇప్పటికే 12 మందికి కరోనా సోకడంతో కమిషనర్​ డీఎస్​ లోకేష్ కుమార్​ ఈ నిర్ణయం తీసుకున్నారు. కొన్నాళ్ల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. శనివారం వివిధ పనుల కారణంగా బల్దియా హెడ్ ఆఫీసుకు వచ్చిన వారిని సెక్యూరిటీ సిబ్బంది లోపలికి వెళ్లనీయకపోవడంతో అసహనంతో వెనుదిరిగారు. కరోనా భయంతో ఆంక్షలు పెట్టిన అధికారులు కరోనా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని విజిటర్స్ అంటున్నారు. బల్దియా హెడ్ ఆఫీసులో ఎలాంటి  ముందస్తు జాగ్రత్తలు లేవంటున్నారు.  ఎంట్రెన్స్ లో శానిటైజ్ మెషీన్ ఏర్పాటు చేసి నెలలు గడుస్తున్నా అది పనిచేయడం లేదు. బల్దియా హెడ్ ఆఫీసులో మీడియా ప్రతినిధులపై కూడా ఆంక్షలు విధించడంతో జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కమిషనర్ స్పందించాలన్నారు. ​ 


గతేడాది నుంచి ఇప్పటి వరకు గ్రేటర్​లో నమోదైన కేసులు
    2020    2021
జనవరి    –    1,568
ఫిబ్రవరి    –    788
మార్చి    64    1,516
        (ఈనెల 26 వరకు)
ఏప్రిల్​    527    
మే    1,015
జూన్​    11,080
జులై    26,660
ఆగస్టు​    12,213
సెప్టెంబర్​    9,502
అక్టోబర్    8,008
నవంబర్​    5,660
డిసెంబర్​    3,189
మొత్తం        81,790