ధరలు పెరిగాయని దొంగతనం చేస్తున్నారు.. వందలో 10 మంది కుర్రోళ్లకు ఇదే పని

ధరలు పెరిగాయని దొంగతనం చేస్తున్నారు.. వందలో 10 మంది కుర్రోళ్లకు ఇదే పని

గత రెండు సంవత్సరాలుగా యూకే ప్రజలు తీవ్రమైన సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. 2021, 2022 మధ్య UK అంతటా జీవన వ్యయం బాగా పెరగడంతో.. గృహావసరాలు తీర్చుకోవడానికి అక్కడి ప్రజలు నానా తంటాలు పడుతున్నారు. దీంతో గత్యంతరం లేక షాపుల్లో దొంగతనాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇటీవల 10మంది యువకులు జీవన వ్యయ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భాగంగా సూపర్ మార్కెట్ లలో చోరీలకు పాల్పడినట్టు అంగీకరించారని ది మెట్రో వెల్లడించింది. ద్రవ్యోల్బణ రేటు రోజు రోజుకూ పెరుగుతుండడంతో ఆహారం, ఇంధన ఖర్చులు ఆకాశాన్నంటాయి. అధిక ధరల భారంతో అతలాకుతలం అవుతోన్న ప్రజలకు రోజూ వారి కనీస అవసరాలు తీర్చుకోవడం కష్టంగా మారింది. పానీయాల ధర 19.1శాతం పెరిగాయి. ఏడాది కాలంలోనే వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. ఆహార పదార్థాల ధరలు గతేడాది కంటే పావు వంతు పెరిగాయని ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ (ONS) వెల్లడించింది.

యూకేలో ధరల భారాన్ని ఎదుర్కోలేక చాలా మంది దొంగతనాలకు పాల్పడుతుండగా.. వీటిలో అత్యధికంగా పిల్లలకు ఉపయోగించే మందులు కాల్ పోల్ వంటివి ఉన్నట్టు తెలుస్తోంది. పాలు, చీజ్ వంటి కొన్ని అత్యవసర పదార్థాలు కూడా ఉన్నట్టు సమాచారం.

ఇంగ్లండ్ అండ్ వేల్స్‌కు సంబంధించిన తాజా ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం గతేడాది సెప్టెంబరులో షాపుల దొంగతనాలు 22 శాతం పెరిగాయని ఇండిపెండెంట్ నివేదించింది. బ్రిటీష్ రిటైల్ కన్సార్టియం గణాంకాలు కూడా అదే సూచిస్తున్నాయి. గత సంవత్సరం 7.9 మిలియన్ కేసులు నమోదయ్యాయని, ఇది 2016/17 కంటే ఐదు మిలియన్లు ఎక్కువ అని సమాచారం.