యాసంగిలో వరి వేస్తే మునుగుతరు

యాసంగిలో వరి వేస్తే మునుగుతరు
  • మిల్లర్లతో ఒప్పందం ఉన్నోళ్లు వేసుకోవచ్చు
  • వచ్చే వానాకాలం కోటి ఎకరాల్లో పత్తి వేయాలె
  • సీసీఐ కొనకున్నా రాష్ట్రమే 
  • ఎంఎస్పీ కన్నా ఎక్కువిచ్చి కొంటది
  • ఇప్పుడు రూ. 3 వేల దాకా ఎక్కువిచ్చే పత్తిని కొంటున్నం
  • రాష్ట్ర బీజేపీ ఎంపీలకు బాయిల్డ్​ రైస్​, రా రైస్​కు తేడా తెలియదు
  • ఏడేండ్లలో కేంద్రం 83% పైగా బాయిల్డ్‌‌ రైసే తీసుకుందని వెల్లడి

హైదరాబాద్‌‌, వెలుగు: యాసంగిలో వరి సాగు చేస్తే ప్రభుత్వం కొనదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌‌ రెడ్డి తేల్చిచెప్పారు. ఇంత చెప్పినా వినకుండా వరి సాగు చేస్తే అది రైతుల ఇష్టమని, నాటేసిన తర్వాత ప్రభుత్వం వడ్లు కొనకపోతుందా అని అనుకుంటే నష్టపోక తప్పదని హెచ్చరించారు. మిల్లర్లతో టై అప్‌‌ ఉన్నవాళ్లు మాత్రమే వరి వేయాలన్నారు. రైతులు కేంద్రాన్ని నమ్మి యాసంగిలో వరి వేస్తే నిండుగా మునుగడం ఖాయమని, కేంద్రానిది తడిబట్టతో గొంతుకోసే రకమని ఆరోపించారు. ఆదివారం తెలంగాణ భవన్‌‌లో ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్‌‌, కాలేరు వెంకటేశ్‌‌, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి నిరంజన్​రెడ్డి  మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల క్రూరాతి క్రూరంగా వ్యవహరిస్తున్నదని, ఐదు రాష్ట్రాల ఎన్నికల కోసం పెదవులతో రైతులకు క్షమాపణ చెప్పారే తప్ప వాళ్లకు రైతులపై ఎలాంటి ప్రేమ లేదని దుయ్యబట్టారు. యాసంగిలో వరి వేసి నష్టపోవద్దనే బాధతోనే మళ్లీ మళ్లీ చెప్తున్నామని, వరి సాగు చేయొద్దన్నారు. ఏయే ప్రత్యామ్నాయ పంటలు వేయాల్నో ఇప్పటికే ట్రైనింగ్​ ప్రోగ్రాంలు ప్రారంభించామని, ఆయా పంటల సాగుకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచినట్లు చెప్పారు. 
గోయల్​ అవాస్తవాలు మాట్లాడుతున్నరు
రాష్ట్రంలో పండిన వడ్ల కొనుగోళ్లపై పార్లమెంట్‌‌లో టీఆర్‌‌ఎస్‌‌ ఎంపీలు ఎంత అరిచినా కేంద్రం వైఖరి మారడం లేదని నిరంజన్​రెడ్డి అన్నారు. కేంద్ర మంత్రి పీయూష్‌‌ గోయల్‌‌ భయంకరమైన అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. 

ధాన్యం కొనుగోలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌‌‌‌‌‌‌‌గానే వ్యవహరిస్తుందన్నారు. రైతులకు కేంద్రం డబ్బులు ఇవ్వడం ఆలస్యం అవుతుంది కాబట్టే తాము ముందు ఇచ్చి కొనుగోళ్లు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రం ఇవ్వాల్సిన బియ్యమే ఇవ్వడం లేదని కేంద్ర మంత్రి మాట్లాడటం సరికాదన్నారు. తమ దగ్గర బియ్యం నిల్వ చేసే ఏర్పాట్లు లేవని, బియ్యం తీసుకెళ్లాలని సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐకి ఎన్నో సార్లు లెటర్లు రాశామన్నారు.  అయినా కేంద్రం బియ్యం తీసుకెళ్లకుండా నెపాన్ని రాష్ట్రంపై మోపుతోందని ఆయన ఆరోపించారు. రా రైస్‌‌‌‌‌‌‌‌, బాయిల్డ్‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌కు తేడా తెలియని వాళ్లు రాష్ట్రం నుంచి బీజేపీ ఎంపీలుగా ఉన్నారని దుయ్యబట్టారు. యాసంగిలో కేవలం దక్షిణాదిలోనే వరి పండుతుందని, టెంపరేచర్‌‌‌‌‌‌‌‌ ఎక్కువగా ఉండి బియ్యం నూక కాకుండా ఉండేందుకు ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐనే బాయిల్డ్‌‌‌‌‌‌‌‌ రైస్‌‌‌‌‌‌‌‌ విధానం తీసుకొచ్చిందన్నారు. ఏడేండ్లలో రాష్ట్రం నుంచి కేంద్ర సేకరించిన మొత్తం ధాన్యంలో 83 నుంచి 100 శాతం బాయిల్డ్‌‌‌‌‌‌‌‌ రైసే ఉందని మంత్రి  వెల్లడించారు. రాజకీయాల కోసం ప్రభుత్వాల స్థాయిని దిగజార్చడం బీజేపీకే చెల్లిందన్నారు. రైతు ఉద్యమంలో ప్రధాన ప్రతిపక్షం పాత్రే లేదని, రైతులు అలుపెరుగని పోరాటం చేసి కేంద్రం మెడలు వంచారని అన్నారు. రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షులు ఎంపీలుగా పార్లమెంట్‌‌‌‌‌‌‌‌లో ఉన్నా రైతుల తరఫున కొట్లాడట్లేదని, రైతుల తరఫున నిలిచింది ఒక్క టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ మాత్రమేనని నిరంజన్​ చెప్పారు. కేంద్రం ఎఫ్‌‌‌‌‌‌‌‌సీఐని రీ స్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌ చేసే కుట్రలు పన్నుతున్నట్లు  తాము పసిగట్టే పంట మార్చాలని రెండేండ్లుగా రైతులను కోరుతున్నామని అన్నారు. కేంద్రం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా కేవలం విన్నింగ్‌‌‌‌‌‌‌‌ టూల్‌‌‌‌‌‌‌‌ పాలిటిక్స్‌‌‌‌‌‌‌‌ చేస్తున్నదని ఆరోపించారు.
వచ్చే వానాకాలం కోటి ఎకరాల్లో పత్తి వేయండి
వచ్చే వానాకాలంలో 80 లక్షల నుంచి కోటి ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగు చేయాలని రైతులకు మంత్రి నిరంజన్​రెడ్డి సూచించారు. ఇప్పుడు కనీస మద్దతు ధర కన్నా రూ. 3వేల వరకు ఎక్కువ ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పత్తిని కొంటోందన్నారు. ఇంటర్నేషనల్‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో పత్తికి డిమాండ్‌‌‌‌‌‌‌‌ ఉందని, ఎంత పంట వచ్చినా కొనే శక్తి రాష్ట్ర ప్రభుత్వానికి ఉందని అన్నారు. సీసీఐ కొనుగోలు చేయకున్నా, రాష్ట్ర ప్రభుత్వమే ఎంఎస్పీ కన్నా ఎక్కువ ధర ఇచ్చి పత్తిని కొంటుందని చెప్పారు. కంది సాగు 10 లక్షల ఎకరాల నుంచి 20 లక్షల ఎకరాలకు పెంచాలన్నారు. వానాకాలంలో వరి ఎంత సాగు చేసినా ఇబ్బంది లేదని, యాసంగిలో మాత్రం వేయొద్దని మంత్రి నిరంజన్ చెప్పారు.