
- సొంతంగా చేపడుతున్న రాష్ట్రాలు
- ఇప్పటికే మధ్యప్రదేశ్‌లో పూర్తి .. తాజాగా బీహార్ ప్రకటన
- తెలంగాణ, ఏపీ, కర్నాటక, మహారాష్ట్రలో కసరత్తు
- రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే టైమ్‌లోనే బీసీల లెక్కలు తీసిన సర్కారు.. ఇప్పటికీ బయటపెట్టలే
హైదరాబాద్, వెలుగు: దేశ వ్యాప్తంగా బీసీ కులాల జనాభాను లెక్కించాలనే డిమాండ్లు పెరగడం, లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి సుప్రీం తీర్పుతో కొన్ని రాష్ట్రాలు సొంతంగానే బీసీ జనాల లెక్కింపు మొదలుపెట్టాయి. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తేలాలంటే, బీసీల లెక్కలు తప్పనిసరిగా ఉండాలని గతంలో సుప్రీం ఆదేశించింది. లేని పక్షంలో రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలు జరపాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సూచించింది. దీంతో ఆ రాష్ట్ర సర్కార్ రెండేండ్లుగా ఎన్నికలు వాయిదా వేసింది. బీసీ రిజర్వేషన్ల అమలుకు బీసీ జనాభా లెక్కింపు చేపట్టింది. పోయినేడాది లెక్కింపు పూర్తి కాగా, ఇటీవల సుప్రీంకు రిపోర్టు అందజేసింది. దీంతో ఎన్నికలు నిర్వహించడానికి కోర్టు ఆమోదం తెలిపింది.
ఏయే రాష్ట్రాల్లో చేస్తున్నరంటే..?
మహారాష్ట్ర విషయంలోనూ సుప్రీం ఇవే ఆదేశాలు ఇచ్చింది. ఈ రాష్ట్రంలో కూడా లెక్కలు లేకపోవడంతో రెండేండ్లుగా లోకల్ బాడీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. బీసీ గణన పూర్తయ్యాకే ఎన్నికలకు వెళ్లాలని సర్కార్ నిర్ణయించింది. ఇందుకోసం ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేసింది. వివరాల సేకరణకు కసరత్తు జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూడా బీసీ గణన చేపట్టాలని నిర్ణయించింది. బీసీ కమిషన్‌కు బాధ్యతలు అప్పగించింది. లెక్కింపు చేపట్టేందుకు కసరత్తు జరుగుతోంది. కర్నాటకలో వారం క్రితమే బీసీ గణన కసరత్తు షురూ చేశారు. ఇందుకోసం ప్రత్యేక కమిషన్‌ను నియమించారు. తాజాగా బీసీ జనాభా లెక్కలు తీయాలని బీహార్ సర్కార్ కూడా నిర్ణయించింది. ఈ మేరకు సీఎం నితీశ్ కుమార్ ప్రకటించారు. త్వరలోనే అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామన్నారు. కాగా, ఇటీవల ఒడిశా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లు లేకుండానే లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించింది. అక్కడ ఎక్కువ శాతం గిరిజనులు ఉండటంతో బీసీ రిజర్వేషన్లను పెద్దగా పట్టించుకోలేదు. ఇక తమిళనాడులో 30 ఏండ్ల కిందనే బీసీ జనాభా లెక్కించారు. వాస్తవానికి అక్కడ లోకల్ బాడీల్లో బీసీలకు రిజర్వేషన్లు లేవు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలు పోను దాదాపు అంతా బీసీలే ఉన్నారు. ఒకటి లేదా రెండు శాతం మాత్రమే ఓసీలు ఉన్నారు. విద్య, ఉద్యోగాల్లో అక్కడ మొత్తం 69 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
మన రాష్ట్రంలో పోయినేడే నిర్ణయం..
బీసీల లెక్కలు తీయాలని మన రాష్ట్ర సర్కార్ పోయినేడాదే నిర్ణయించింది. డిసెంబర్‌లో జీవో ఇచ్చింది. బీసీ కమిషన్‌కు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటికే కమిషన్ పలు దఫాలుగా సమావేశమైంది. ఇటీవల తమిళనాడులో పర్యటించింది. గతంలో తమిళనాడులో లెక్కలు ఎట్ల తీశారు? తదితర అంశాలపై స్టడీ చేసింది. తాజాగా కమిషన్ మంగళవారం కర్నాటకకు వెళ్లింది. ఆపై మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఏపీలోనూ పర్యటిస్తుంది. ఇప్పటి వరకు చేసిన స్టడీ ప్రకారం 3 నుంచి 6 నెలల్లో జన గణన పూర్తి చేయొచ్చని కమిషన్ భావిస్తోంది. కాగా, తెలంగాణ వచ్చినంక రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించింది. అందులో బీసీల లెక్కలు కూడా ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఆ సర్వే లెక్కలు రిలీజ్ చేయలేదు.
సుప్రీం ఏం చెప్పిందంటే?
రిజర్వేషన్లు 50% దాటొద్దనే సుప్రీంకోర్టు తీర్పుతో అన్ని రాష్ట్రాల్లో ఇబ్బందులు మొదలయ్యాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించగా, మరికొన్ని రాష్ట్రాలు ఆ దిశగా కసరత్తు చేస్తున్నాయి. అయితే బీసీ గణన చేశాకే, రాష్ట్రాలు రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ నెల 10న సుప్రీం తీర్పు ఇచ్చింది. ఇది అన్ని రాష్ట్రాలకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు తప్పనిసరిగా బీసీల లెక్కలు తీయాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాపడుతున్నారు. లేకుంటే బీసీ రిజర్వేషన్లు రద్దయ్యే చాన్స్ ఉంది. ఎస్సీ, ఎస్టీ మినహా ఏ రిజర్వేషన్లు ఉండవు. రాజ్యాంగంలో ఉంది కాబట్టి ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయి.