ఇకముందు కమ్యూనిస్టులు, ప్రతిపక్షాలే టార్గెట్

ఇకముందు కమ్యూనిస్టులు, ప్రతిపక్షాలే టార్గెట్
  • డెడ్ లైన్ పెట్టి మావోయిస్టులను చంపుతున్న కేంద్రం
  • సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి

కరీంనగర్, వెలుగు: మావోయిస్టులకు డెడ్ లైన్ పెట్టి కేంద్రం చంపుతుందని, ఇకముందు కమ్యూనిస్టులు, ప్రతిపక్షాలే టార్గెట్ అని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంకటరెడ్డి ఆరోపించారు. సీపీఐ ఏర్పాటై వందేండ్లయిన సందర్భంగా ఆదివారం కరీంనగర్  గీతా భవన్ చౌరస్తా నుంచి కలెక్టరేట్ మీదుగా రెవెన్యూ గార్డెన్స్ వరకు పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బహిరంగ సభలో  ఆయన మాట్లాడుతూ.. నక్సలైట్లు దేశభక్తులని, కానీ వారు ఎంచుకున్న పంథా సరైందికాదన్నారు.

దేశంలో కమ్యూనిస్టుల పని అయిపోయిందంటున్నవారు 100 ఏండ్లుగా పోరాటాలు చేస్తుందనేది గుర్తుంచుకోవాలని సూచించారు. స్వాతంత్ర్య , తెలంగాణ సాయుధ పోరాటాల్లో సీపీఐ, అనుబంధ సంఘాలు కీలకపాత్ర పోషించాయని గుర్తుచేశారు.  

నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించి వెట్టి నుంచి ప్రజలను విముక్తి చేసి లక్షలాది ఎకరాల భూములు పంచిన చరిత్ర పార్టీకి ఉందని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ లేవన్నారు. కమ్యూనిస్టుల ఐక్యతే దేశానికి ప్రత్యమ్నాయమన్నారు.  దేశానికి ఒక దిక్సూచి అయ్యేందుకు ఈనెల18న ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సక్సెస్ చేయాలని పార్టీ శ్రేణులను కోరారు. ఈ సభలో  పార్టీ రాష్ట్ర నేతలు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, కలవేన శంకర్, జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్  మాట్లాడారు.   పార్టీ నేతలు పాల్గొన్నారు.