
- అధికారులు, ఏజెన్సీలకు తేల్చి చెప్పిన సీడబ్ల్యూపీఆర్‌ఎస్ ఎక్స్‌పర్ట్స్
- 4 రోజులుగా బ్యారేజీల వద్ద పరిస్థితుల పరిశీలన
- ఒకట్రెండు నెలల్లో రిపోర్ట్ఇవ్వలేమన్న నిపుణులు
- బేస్‌లైన్ టెస్టులు ఈ ఏడాది చివరి నాటికే సాధ్యం..
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం బ్యారేజీల పరిస్థితి ఏమాత్రం బాగాలేదని, అక్కడ టెస్టులు అంత తొందరగా అయ్యే పని కాదని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్‌స్టేషన్ (సీడబ్ల్యూపీఆర్ఎస్) స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇక్కడ పరిస్థితులను బట్టి టెస్టులపై తొందరపెట్టొద్దని, జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని ఆ సంస్థ ఎక్స్‌పర్ట్స్ తేల్చి చెప్పినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. ఒకట్రెండు నెలల్లో చేయమంటే సాధ్యం కాదని, ఈ ఏడాది చివర్లోనే టెస్టులు చేసేందుకు వీలవుతుందని తెలిపినట్టు సమాచారం.
మేడిగడ్డ బ్యారేజీ కుంగిన నేపథ్యంలో.. అక్కడ థర్డ్ పార్టీ ఏజెన్సీతో జియో టెక్నికల్, జియోఫిజికల్ టెస్టులను చేసి.. అనంతరం రిపేర్లు చేయాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్‌ఏ) ఇటీవల తుది నివేదికలో సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే పుణెకి చెందిన సీడబ్ల్యూపీఆర్ఎస్తో మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద టెస్టులు చేయించాలని సర్కారు నిర్ణయించింది.
అందులో భాగంగా 4 రోజుల క్రితం ఇక్కడకు వచ్చిన సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణుల బృందం.. బ్యారేజీల వద్ద పరిస్థితి ఎలా ఉందో పరిశీలించింది. బ్యారేజీల పరిస్థితి ఇప్పటికీ ప్రమాదకరంగానే ఉందని అధికారులు, ఏజెన్సీలకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇప్పటికిప్పుడు టెస్టులు చేయడం సాధ్యం కాదని పేర్కొన్నట్టు సమాచారం.
ప్రస్తుతం సాధ్యం కాదు
నదిలో భారీ వరద ప్రవాహాలు ఉండడంతో ఇప్పుడు జియోటెక్నికల్, జియోఫిజికల్ టెస్టులు చేయలేమని సీడబ్ల్యూపీఆర్‌ఎస్ నిపుణులు చెప్పారు. వరదలు తగ్గుముఖం పట్టాక మొదలుపెడతామని పేర్కొన్నారు. అయితే, అప్పుడు కూడా టెస్టులను వేగంగా ఇవ్వాలంటూ తొందరపెట్టొద్దని, జాగ్రత్తగా చేయాల్సి ఉంటుందని అధికారులకు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి మాత్రమే బేస్‌లైన్ స్టడీలు సాధ్యమని స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆ డేటా విశ్లేషణకూ చాలా సమయం పడుతుందని, టెస్టులు చేసిన వెంటనే రిపోర్టులు ఇవ్వడం సాధ్యం కాదని పేర్కొన్నట్టు తెలిసింది.
వెంటనే ఇవ్వాలంటే తమ వల్ల కాదని తేల్చి చెప్పినట్టు సమాచారం. అయితే, పనుల పర్యవేక్షణ, టెస్టుల ఖర్చులకు రూ.2.5 కోట్లు ఖర్చవుతాయని, ఆ మొత్తాన్ని ముందుగానే చెల్లించాలని అధికారులకు నిపుణులు చెప్పారు. ఆ ఖర్చును కాంట్రాక్ట్ ఏజెన్సీలు భరించాల్సి ఉన్నా.. అది తమ బాధ్యత కాదని ఏజెన్సీ ప్రతినిధులు తప్పించుకుంటున్నట్టు చెబుతున్నారు.
కచ్చితమైన డేటా వస్తుందో లేదో చెప్పలేం..
మేడిగడ్డ బ్యారేజీ కుంగాక.. ఏడో బ్లాక్ కింద భారీ గొయ్యి ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆ గొయ్యిని పూడ్చేందుకు అక్కడ అధికారులు గ్రౌటింగ్ చేశారు. దీనిని ఎన్‌డీఎస్ఏ తప్పుబట్టింది. జియోటెక్నికల్ ఇన్వెస్టిగేషన్స్ చేసినా ప్రయోజనం లేదని, అక్కడ ఎవిడెన్స్ పోయిందని తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలోనే సీడబ్ల్యూపీఆర్‌ఎస్ దానికి ఒక పరిష్కారాన్ని చూపించింది. గ్రౌటింగ్ చేసిన ప్రాంతంలో జియోటెక్నికల్ టెస్టులు చేసినా కచ్చితమైన ఫలితం వస్తుందో లేదో తెలియదని పేర్కొన్నది.
అందుకే ఆ బ్లాక్‌లో మేడిగడ్డ బ్యారేజీకి ఎగువన 60 మీటర్ల దూరం, దిగువన 60 మీటర్ల దూరంలో 25 మీటర్ల లోతుతో బోర్‌హోల్స్ వేసి కోర్ శాంపిళ్లను సేకరించాలని అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులకు సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు సూచించినట్టు తెలిసింది. మిగతా అన్ని బ్లాకుల్లో యథాస్థానంలోనే శాంపిళ్లను సేకరించాలని చెప్పినట్టు సమాచారం.