రైల్వేశాఖ గుడ్​ న్యూస్​: దసరా, దీపావళికి 1,400 ప్రత్యేక రైళ్లు

రైల్వేశాఖ గుడ్​ న్యూస్​: దసరా, దీపావళికి 1,400 ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య రైల్వే వెల్లడి
 

సికింద్రాబాద్, వెలుగు: దసరా, దీపావళి పండుగల రద్దీ దృష్ట్యా 1400 ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. దసరా, దీపావళికి తెలుగు రాష్ర్టాల మధ్య ప్రయాణానికి డిమాండ్​ ఎక్కువగా ఉంటుంది. అలాగే బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ కు కూడా రద్దీ ఎక్కువ ఉంటుంది.ఈ డిమాండ్​ను దృష్టిలోపెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే రోజువారీ రైళ్లతో పాటు ప్రత్యేకంగా 1400 రైళ్లను  నడుపుతున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లను నవంబర్ 30 వరకు వేర్వేరు తేదీల్లో నడపనున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించాలని దక్షిణ మధ్య రైల్వే యోచిస్తోంది. 

ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు బుకింగ్  కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తోంది. ప్రత్యేక రైళ్ల సేవలు దక్షిణ మధ్య రైల్వేలోని ప్రధాన స్టేషన్ల నుంచి తిరుపతి, నిజాముద్దీన్, విశాఖపట్నం, సంత్రాగచ్చి, గోరఖ్పూర్, అగర్తల, రక్సాల్, నాగర్సోల్, దానాపూర్, శ్రీకాకుళం, నాగ్పూర్, మాల్డా టౌన్, పాట్నా, షాలిమార్, షిర్డీ, సోలాపూర్, పుణె, ముంబై,  జైపూర్ మొదలైన ప్రముఖ మార్గాలలో నడుపుతున్నారు. ప్రయాణీకుల అవసరాలను తీర్చడానికి రిజర్వ్​డ్,​ అన్ రిజర్వ్​డ్​  కోచ్ లతో నడుపుతున్నారు. కౌంటర్ల వద్ద క్యూలో నిలబడకుండా టిక్కెట్లను మొబైల్ యాప్ లో యూటీఎస్ ద్వారా కొనుగోలు చేసుకొనే అవకాశం కల్పించారు.