ఒకప్పుడు ఇంజినీరింగ్ విద్య అంటే ఉపాధికి భరోసా. మధ్యతరగతి కుటుంబాల్లో ఒక పిల్లాడు ఇంజినీరింగ్‌లో అడుగుపెడితే, అది కేవలం ఒక కోర్సు కాదు.. కుటుంబానికి ఒక భవిష్యత్ భద్రత. ‘జాబ్ ఖాయం’ అనే నమ్మకం ఉండేది. కానీ, నేటి ఏఐ యుగంలో ఆ నమ్మకం కాస్త కొట్టుమిట్టాడుతోంది. తల్లిదండ్రుల కళ్లలో ఆశతోపాటు ఆందోళన కూడా కనిపిస్తోంది. ఇంజినీరింగ్ చదివితే నిజంగా ఉద్యోగం వస్తుందా? అనే ప్రశ్న ఇప్పుడు సాధారణమైంది. ఈ మార్పుకు ప్రధాన కారణం ఏఐ. గతంలో మనిషి సమయం, శ్రమ, ఆలోచనతో చేసే పనులను, ఇప్పుడు ఏఐ ఆధారిత సాఫ్ట్‌వేర్‌లు క్షణాల్లో పూర్తి చేస్తున్నాయి. ఏఐ టూల్స్ ప్రోగ్రామింగ్ నుంచి కంటెంట్ క్రియేషన్ వరకు అనేక రంగాల్లో మనిషికి ప్రత్యామ్నాయంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంజినీరింగ్ విలువ తగ్గిపోయిందా? అనే సందేహం తలెత్తడం సహజం.
ఏఐ ఆధారిత కొత్త అవకాశాలు
వాస్తవానికి ఇంజినీరింగ్ విలువ తగ్గలేదు. అది రూపాంతరం చెందుతోంది. ఇప్పటివరకు ఇంజినీరింగ్ అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్, కోడింగ్ స్కిల్స్, డిగ్రీ మార్కులు ప్రధాన ప్రమాణాలు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కంపెనీలు ఇక మార్కుల కంటే సమస్యను పరిష్కరించే సామర్థ్యం, కొత్త టెక్నాలజీలను నేర్చుకునే వేగం, క్రియేటివ్ ఆలోచన వంటి అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. అంటే డిగ్రీ ఒక పాస్‌పోర్ట్ మాత్రమే. గమ్యం చేరడానికి కావాల్సింది స్కిల్స్. ఇటీవల టెక్ రంగంలో జరిగిన లే-ఆఫ్స్ కూడా ఈ మార్పుకు సంకేతం.
సాధారణ పనులను చేసే ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయి. ఎందుకంటే ఆ పనులను ఏఐ సులభంగా చేయగలదు. కానీ, అదే సమయంలో కొత్త అవకాశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. ఏఐ డెవలప్‌మెంట్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం ఉన్న ఇంజినీర్లకు డిమాండ్ పెరుగుతోంది. అంటే ఇక్కడ ఒక స్పష్టమైన సందేశం ఉంది.
ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఇంజినీర్లకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ విద్యార్థులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించాలి. కాలేజ్‌లో నేర్పిన సిలబస్ మాత్రమే సరిపోదు. ప్రపంచం వేగంగా మారుతోంది. కొత్త టూల్స్, కొత్త టెక్నాలజీలు నిరంతరం నేర్చుకోవాల్సిందే. ప్రాజెక్టులు చేయడం, ఇంటర్న్‌షిప్స్, ఆన్‌లైన్ కోర్సులు ఇవే ఇంజినీర్లకు ప్రాధాన్యతగా మారుతున్నాయి.
తల్లిదండ్రుల దృష్టికోణం కూడా మారాలి
ఏఐ ప్రాధాన్యత రోజురోజుకూ పెరుగుతున్న తరుణంలో విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టికోణం కూడా మారాలి. ఇంజినీరింగ్ చేస్తే జాబ్ ఖాయం అనే పాత ఆలోచన ఇక వర్తించదు. పిల్లల ఆసక్తి, వారి సామర్థ్యం, మార్కెట్ ట్రెండ్స్ ఇవన్నీ కలిపి తగిన నిర్ణయం తీసుకోవాలి. కొందరికి ఇంజినీరింగ్ సరైన మార్గం కావొచ్చు. మరికొందరికి ఇతర రంగాలు మరింత అనుకూలం కావొచ్చు.
ఇంకో ముఖ్యమైన అంశం ఏఐ ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏఐని రూపొందించేది, అభివృద్ధి చేసేది కూడా ఇంజినీర్లే. కాబట్టి, టెక్నాలజీని దూరం పెట్టడం కాదు, దానితో కలిసి ఎదగడం అవసరం. ఏఐ యుగంలో ఇంజినీరింగ్ ఒక ముగింపు దశలో లేదు. అది ఒక కొత్త దిశలో ప్రయాణిస్తోంది. ఈ మార్పును అంగీకరించి, కొత్త నైపుణ్యాలను అలవర్చుకున్నవారికి అవకాశాలు అపారంగా ఉన్నాయి.
అందుకే మనముందు ఇప్పడున్న అసలు ప్రశ్న ఇంజినీరింగ్ చేయాలా వద్దా అని కాదు. ఏ స్కిల్స్‌తో ముందుకు వెళ్లాలి? ఈ ప్రశ్నకు సమాధానం కనుగొన్నవారే రేపటి టెక్నాలజీ ప్రపంచంలో నిజమైన విజేతలుగా ఉన్నతస్థాయికి చేరుకుంటారు.
- ఎల్లబోయిన వెంకటేశ్వర్లు
ఓపెన్ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్ ఐడీ
openpage@v6velugu.com
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని
హామీ తప్పనిసరి రాయాలి.
స్వీయ రచన అయి ఉండాలి.
రచన 700 పదాలకు మించరాదు.
