- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలవలనాగారం భూవివాదానికి తెర
- సింగిల్ జడ్జి తీర్పును రద్దు చేసిన డివిజన్ బెంచ్ నిర్ణయం సరైనదేనని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సుమారు 600 ఎకరాల భూమి యాజమాన్య హక్కులపై దశాబ్దాలుగా నలుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలికింది. కరకగూడెం మండలం కలవల నాగారం గ్రామంలోని సర్వే నం.81లోని ఈ భూమి అటవీశాఖకే చెందుతుందని స్పష్టం చేస్తూ జస్టిస్ పంకజ్ మిథల్, జస్టిస్ ఎస్ వీ ఎన్ భట్టితో కూడిన ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. రెవెన్యూ రికార్డుల్లో పేర్లు ఉన్నంత మాత్రాన భూమిపై యాజమాన్య హక్కులు సంక్రమించవని, అవి కేవలం పన్ను వసూలుకు మాత్రమే పరిమితమని కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
పిటిషనర్ల వాదన ప్రకారం.. 1931---_32 (1341 ఫస్లీ)లో అప్పటి నిజాం ప్రభుత్వం తమ పూర్వీకులకు ఈ భూమిపై పట్టాలు ఇచ్చింది. అధికారికంగా వివాదం 1950 ఫిబ్రవరి 6న ప్రారంభమైంది. ఆ రోజున అప్పటి ప్రభుత్వం హైదరాబాద్ అటవీ చట్టం కింద గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ.. కలవలనాగారం సర్వే నం.81లోని 787 ఎకరాల భూమిని ‘రిజర్వ్ ఫారెస్ట్’గా మార్చాలని ప్రతిపాదించింది. దీనిని వ్యతిరేకిస్తూ పట్టాదారులు కోర్టులను ఆశ్రయించడంతో ఈ సుదీర్ఘ న్యాయపోరాటం మొదలైంది. 1950 లో రిజర్వ్ ఫారెస్ట్ ప్రతిపాదనపై నోటిఫికేషన్ విడుదలయంది.
1990లో భూమిని అటవీపరిధి నుంచి మినహాయించాలని కోరుతూ పట్టాదారులు ఖమ్మం జాయింట్ కలెక్టర్‌ను ఆశ్రయించారు. 2003 మే 19న నాటి ఖమ్మం జాయింట్ కలెక్టర్ విచారణ జరిపి, పిటిషనర్ల వద్ద అసలైన పట్టా ధ్రువీకరణ పత్రాలు లేవని, రికార్డుల్లో భూమి ‘జంగిల్’ (అడవి) అని ఉందని పేర్కొంటూ వారి దరఖాస్తును తిరస్కరించారు. 2012 మార్చి 27 లో జాయింట్ కలెక్టర్ ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన రిట్ పిటిషన్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పునిస్తూ.. 1950 నాటి నోటిఫికేషన్ చెల్లదని, అది పిటిషనర్ల పట్టా భూమేనని ప్రకటించారు. సింగిల్ జడ్జి తీర్పును సవాలు చేస్తూ ప్రభుత్వం అప్పీలు చేయగా.. డివిజన్ బెంచ్ ప్రభుత్వ వాదనతో ఏకీభవించింది. సింగిల్ జడ్జి తన పరిధిని దాటి టైటిల్ (హక్కు) ప్రకటించారని పేర్కొంటూ ఆ తీర్పును రద్దు చేసింది. దీనిపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నివేదికతో..
సుప్రీంకోర్టు తన తీర్పులో అత్యంత కీలకమైన న్యాయ సూత్రాలను ప్రస్తావించింది. ఫైసల్ పట్టీ, పహానీలు, వసూల్ బాకీ వంటి రికార్డులు కేవలం ఆర్థిక అవసరాల కోసం మాత్రమే. అంటే.. ప్రభుత్వం పన్ను వసూలు చేయడానికి ఎవరి పేరు మీద భూమి ఉందో చూపే రికార్డులు మాత్రమే. ఇవి భూమిపై యాజమాన్య హక్కును సృష్టించలేవు. నిజాం కాలంలో పట్టా వచ్చిందని చెబుతున్నా, దానికి సంబంధించిన అసలు పత్రాలను పిటిషనర్లు ఎక్కడా చూపలేకపోయారు. రాజ్యాంగంలోని అధికరణ 226 కింద హైకోర్టులు భూమి హక్కుల వంటి సంక్లిష్టమైన వాస్తవాలపై తీర్పులు ఇవ్వకూడదని, అటువంటి వివాదాలను సివిల్ కోర్టులే తేల్చాలని ధర్మాసనం స్పష్టం చేసింది.
1954-=55 నాటి ఖాస్రా పహానీల్లో ఈ భూమి ‘ఉఫ్తాడా’ (సాగులో లేని భూమి) అని, దట్టమైన అడవితో నిండి ఉందని రికార్డై ఉంది. 70 ఏండ్లుగా పిటిషనర్లు అక్కడ సాగులో లేరని జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నివేదికను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. 75 ఏండ్లుగా కొనసాగుతున్న ఈ వ్యాజ్యాన్ని ఇంకా పొడిగించడం సరికాదని భావించిన సుప్రీంకోర్టు, హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును సమర్థించింది. దీంతో కలవల నగరం సర్వే నం.81లోని 600 ఎకరాల భూమి ఇప్పుడు అటవీశాఖ పరం కావడానికి మార్గం సుగమమైంది.
