- కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి
- ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలని వినతి
- ఎయిర్‌పోర్ట్ – భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను ఫేజ్ 3గా చేపట్టాలని సూచన
న్యూఢిల్లీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏడు కారిడార్లతో కూడిన మెట్రో ఫేజ్- 2 సమగ్ర ప్రణాళికను రూపొందించి డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం ఖట్టర్‌ను ఆయన నివాసంలో సీఎం కలిశారు. ఈ సమావేశంలో కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ కార్యదర్శి కె.శ్రీనివాస్, సీఎం స్పెషల్ సెక్రటరీ బి.అజిత్ రెడ్డి, హెచ్ఎంఆర్ఎల్ ఎండీ సర్ఫరాజ్ అహ్మద్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (పట్టణ రవాణా) ఎన్.వి.ఎస్.రెడ్డి, ఢిల్లీ తెలంగాణ భవన్ ప్రత్యేకాధికారి సంజయ్ కుమార్, కేంద్ర ప్రభుత్వ పథకాల సమన్వయ కార్యదర్శి అద్వైత్ కుమార్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్- 2, మెట్రో ఫేజ్-3పై కేంద్ర మంత్రితో చర్చించారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో ప్రయాణికుల సౌకర్యం కోసం మెట్రోను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రికి సీఎం వివరించారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-2, ఫేజ్-3 విస్తరణ సజావుగా సాగాలనే ఉద్దేశంతోనే మెట్రో ఫేజ్-1ను ఎల్ అండ్ టీ ఎంఆర్‌హెచ్‌ఎల్‌ను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నదని తెలిపారు. ప్రస్తుతం ఫేజ్-1 ప్రభుత్వ పరిధిలో ఉండడంతో ఫేజ్-2, ఫేజ్-3 విస్తరణ సులువవుతుందన్నారు.
ఫేజ్-2లో ఏడు కారిడార్లతో మొత్తం 122.9 కి.మీ మేర విస్తరణకు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన సమగ్ర డీపీఆర్‌ను ఇప్పటికే సమర్పించామని కేంద్ర మంత్రికి రేవంత్ గుర్తుచేశారు. హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్ 2 ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం– తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్ గా చేపట్టేందుకు త్వరగా ఆమోదం తెలపాలని రిక్వెస్ట్ చేశారు.
ఫేజ్-3గా చేపట్టండి
అలాగే హైదరాబాద్ నగర భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఎయిర్‌పోర్ట్ – భారత్ ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను మెట్రో ఫేజ్ 3గా చేపట్టాలని కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ను సీఎం కోరారు. మెట్రో ఫేజ్-3కి సంబంధించిన డీపీఆర్ ను ఇప్పటికే సమర్పించామని తెలిపారు. ఈ సందర్భంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం, భవిష్యత్ తరాలకు క కొత్త సిటీ ఆవశ్యకత వంటి అంశాలను వివరించారు.
