యువతకు ఇజ్రాయెల్లో 1,200 మందికి ఉపాధి: మంత్రి వివేక్ వెంకటస్వామి

యువతకు ఇజ్రాయెల్లో 1,200 మందికి ఉపాధి: మంత్రి వివేక్ వెంకటస్వామి

 

  • తుది దశకు ఎంపిక ప్రక్రియ: కార్మిక శాఖ మంత్రి వివేక్​ వెంకటస్వామి 
  • ఈ నెల10 వరకు అభ్యర్థులకు ఫైనల్ స్కిల్ టెస్టులుంటాయని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని స్కిల్ కలిగిన యువతకు ఇజ్రాయెల్‌‌లో భారీగా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని కార్మిక, ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. బుధవారం మాసాబ్ ట్యాంక్‌‌లోని ‘టామ్‌‌కామ్’ కార్యాలయంలో ఇజ్రాయెల్ ప్రభుత్వ ప్రతినిధులు, ప్రైవేట్ రంగ భాగస్వాములతో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ స్థాయిలో మన కార్మికుల నైపుణ్యాన్ని గుర్తించి, వారికి మెరుగైన ఉపాధి కల్పించేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. నేషనల్ స్కిల్ డెవలప్‌‌మెంట్ కార్పొరేషన్ ఇంటర్నేషనల్ (ఎన్‌‌ఎస్‌‌డీసీఐ), ఇజ్రాయెల్ ఇమ్మిగ్రేషన్ అథారిటీ (పీఐబీఏ) సంయుక్తంగా ఈ నియామక ప్రక్రియను చేపడుతున్నాయి. ఇజ్రాయెల్‌‌లోని రెనోవేషన్ రంగంలో సుమారు 1,200 మంది కార్మికుల అవసరముందని గుర్తించినట్లు మంత్రి తెలిపారు.

ఎంపిక ప్రక్రియ ఇలా..

సిరామిక్ టైలింగ్, ప్లాస్టరింగ్, బ్లాక్ మేసన్, డ్రై వాల్ వంటి విభాగాల్లో అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. గత నవంబర్‌‌లో నిర్వహించిన ప్రాథమిక పరీక్షలో 4,247 మంది పాల్గొనగా, అందులో 2,059 మంది అర్హత సాధించారు. ప్రస్తుతం తుది దశకు ఎంపికైన 1,200 మందికి మే 5 నుంచి 10వ తేదీ వరకు ఫైనల్ స్కిల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సహకారాన్ని భవిష్యత్తులో మరిన్ని రంగాలకు విస్తరిస్తామని మంత్రి ఈ సందర్భంగా వివరించారు. కార్యక్రమంలో కార్మిక శాఖ కార్యదర్శి దాసరి హరిచందన, ఉపాధి శిక్షణ డైరెక్టర్ కాంతి వెస్లీ, టామ్‌‌కామ్ అధికారులు పాల్గొన్నారు.